ఈవీఎంలలో నేతల భవితవ్యం..!

siri Madhukar

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా  చివరి విడత ఎన్నికల పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. 72 నియోజకవర్గాలకు గానూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది.   మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునివ్వడంతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. రాష్ట్ర, కేంద్ర పోలీసులతో పాటు సైన్యంతో కలిపి మొత్తం లక్షమందిని బందోబస్తుకు వినియోగిస్తున్నారు.  


సాయంత్రం 6 గంటల వరకు 71.93 శాతం ఓటింగ్ నమోదయింది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో భారీ ఓటర్లు ఉండడంతో..వారిని పోలింగ్‌కు అనుమతించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉందని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా తెలిపారు.  ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పోటీలో నిలిచారు. శాసనసభ స్పీకర్, తొమ్మిది మంది మంత్రులు, ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడు తదితరుల భవితవ్యం త్వరలో తేలనుంది.  రెండో దశ ఎన్నికల్లో మొత్తం 72 నియోజకర్గాల్లో మొత్తం 1079 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 119 మంది మహిళా అభ్యర్థులున్నారు.


మొత్తం 1,53,85,000 పైగా ఓటర్లున్నారు. 19,296 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ చేపట్టారు. కవర్దా నియోజకవర్గంలో సీఎం రమణ్‌సింగ్ ఓటు హక్కు వినియోగించకున్నారు. మావోల కంచుకోటలుగా పేరొందిన 18 నియోజకవర్గాల్లో ఈ నెల 12న తొలిదశ పోలింగ్ జరిగింది. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి (జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్), ప్రతిపక్ష నేత టీఎస్ సింగ్ డియో (కాంగ్రెస్) సహా పలువురు కీలక నేతలు రెండో దశ ఎన్నికలలో అదృష్టం పరీక్షించుకున్నారు. వారి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వచ్చే నెల 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: