ఎయిర్ హోస్టెస్ పై లైంగిక వేదింపులు: మంత్రి సురేష్‌ ప్రభు స్పందన

సీనియర్ అధికారి ఒకరు తనను లైంగికంగా వేధిస్తున్నట్టు గతేడాది సెప్టెంబరులో యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఎయిరిండియా ఎయిర్ హోస్టెస్ ఒకరు ఆరోపించారు. సంస్థ నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు అండదండగా నిలవాలని కోరుతూ మంగళవారం ఆమె సోషల్ మీడియా ను ఆశ్రయించారు. 

దీనిపై  స్పందించిన పౌర విమానయాన మంత్రి సురేష్‌ ప్రభు, ట్వీట్ చేస్తూ, ఎయిర్ హోస్టెస్ ఆరోపణలపై సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా ఎయిరిండియా, చైర్మన్‌ ను ఆదేశించినట్టు పేర్కొన్నారు. అవసరమైతే ఇందుకోసం ఒక కమిటీని కూడా నియమిస్తామని తెలిపారు. లైంగిక వేధింపులపై తాను చేసిన ఫిర్యాదు పట్ల ఎయిర్‌ ఇండియా అంతర్గత కమిటీ విచారణ తీరును సంస్థకు చెందిన మహిళా ఉద్యోగి తప్పుపడుతూ ట్వీట్‌ చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ మేరకు స్పందించారు.
 
ఈనెల 25న మంత్రి సురేష్ ప్రభుకు ఎయిర్‌హోస్టెస్ ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. "సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు గత ఆరేళ్లుగా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు. టార్చర్ పెడుతున్నాడు. వివక్ష చూపిస్తున్నాడు. నేను మిమ్మల్ని కలిసినప్పుడు అతడి పేరు చెబుతా. అతడో ప్రిడేటర్ (పరాన్నజీవి — ఇతర జంతువులను చంపి తినే జంతువు) లైంగికంగా వేధిస్తున్నాడు. నాతో సహా మహిళలు అందరినీ బార్లకు తీసుకెళ్లి మద్యం తాగమని బలవంతం చేస్తున్నాడు. అతడు చెప్పినట్టు చేయకపోవడంతో నా జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. అలాగే చేస్తున్నాడు కూడా! తన కోరికను తీర్చలేదన్న కోపంతో ఆయన తనకు అధికారికంగా దక్కాల్సిన ప్రయోజనాలను కల్పించకుండా అడ్డుకున్నారని" అని ఆమే ఆ లేఖలో ఆరోపించారు.

ఇతర మహిళా సహోద్యోగులకు సైతం ఇదే అనుభవం ఎదురైందని ఆమె లేఖలో పేర్కొన్నారు. అంతర్గత విచారణలో అధికారి తీరుపై తాను ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదని, తన ఫిర్యాదుపై ఆయనను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ అనుమతించలేదని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నిందితుడికి రాజకీయ పలుకుబడి ఉందని, అతడిని కఠినంగా శిక్షించేందుకు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ చొరవ చూపాలని కోరారు.
 
'ఎయిరిండియా విమెన్స్-సెల్‌' కూడా తన ఫిర్యాదుపై స్పందించలేదని ఎయిర్ హోస్టెస్ ఆవేదన వ్యక్తం చేసింది. విమెన్స్-సెల్‌ అధికారిణి సైతం అతడు తనతో కూడా అలానే ప్రవర్తించేవాడని, ఇంకో కంపెనీలో అయితే ఈపాటికే తనను బదిలీ చేయడమో, సస్పెండ్ చేయడమో చేసేవారని, కాబట్టి సైలెంట్‌గా ఉండాలని ఆమె తనకు సూచించిందని ఫిర్యాదులో పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: