ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్ అంటున్న సిద్ధూ..!!

Vasishta

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచారంలో దూసుకెళ్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పూర్తిస్వేచ్ఛ ఇచ్చిన అధిష్టానం.. ఆయన ఇమేజ్ పైనే ఆశలు పెట్టుకుంది. మోదీ వైఫల్యాలు, యడ్యురప్ప అవినీతినే ప్రధాన అస్ర్తంగా చేసుకున్న సిద్ధరామయ్య.. ప్రచారాన్ని తనదైన స్టైల్లో హోరెత్తిస్తున్నారు. ప్రచారంలో రాహుల్ గాంధీ గెస్ట్ రోల్ కే  పరిమితమైనా.. బీజేపీని సింగిల్ హ్యాండ్ తో ఎదుర్కొంటున్నారు సిద్ధరామయ్య.


రాజకీయ ప్రత్యర్ధులపై పదునైన విమర్శలు.. జనాన్ని  ఆకట్టుకునేలా ప్రసంగాలు  చేయడంలో కర్ణాటక ముఖ్యమంత్రి  సిద్ధరామయ్య దిట్ట. ప్రత్యర్ధుల హావబావాలను పలికిస్తూ..వారిని ఇమిటేట్ చేయగల సమర్ధుడు సిద్ధరామయ్య. అందుకే ఆయనకు  మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. సిద్ధరామయ్యలో ఈ టాలెంట్ ను పసిగట్టిన రాహుల్ గాంధీ.. కర్ణాటకలో ఆయన మాస్ ఇమేజ్ నే అస్ర్తంగా వాడుకుంటోంది. బీజేపీలో ఎంతమంది స్టార్ క్యాంపెయినర్లున్నా.. కాంగ్రెస్ తరపున మాత్రం సిద్ధరామయ్యే స్టార్ క్యాంపెయినర్ గా మారారు. రాహుల్ గాంధీ అడపాదడపా సీన్ లోకి వస్తున్నా.. సిద్ధరామయ్య మాత్రం మోదీ నుంచి యడ్యురప్ప వరకూ అందరిని తనదైన స్టైల్లో విమర్శిస్తూ.. దూసుకెళ్తున్నారు.


దక్షిణాదిలో మరో  దఫా పాగా వేసేందుకు తహతహలాడుతున్న భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టకుంటే..దేశంలో మోదీ హవాకు తిరుగుండదని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే కర్ణాటక రాజకీయాల్లో గెలుపోటములను శాసించే లింగాయత్ లను  ప్రత్యేక మతంగా గుర్తించే సాహసోపేతమైన నిర్ణయానికి  కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానాలకు వ్యతిరేకమే అయినా..  సిద్ధరామయ్య  పోల్  స్ర్టాటజీలో భాగంగానే ఈ నిర్ణయానికి కాంగ్రెస్ అడ్డుచెప్పలేదనే వాదన  బలంగా వినిపించింది.  ప్రీపోల్ సర్వేల్లోనూ పోటీ నువ్వానేనా అన్నట్టు ఉంటుందనే సంకేతాలతో .. కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకు మరింత స్వేచ్ఛ ఇచ్చింది.


కురుబ సామాజికవర్గానికి చెందిన సిద్ధరామయ్యకు  బలమైన బీసీ నేతగా గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే బాదామి, చాముండేశ్వరి స్థానాల నుంచి పోటీ చేస్తున్న సిద్ధరామయ్య.. ఈ రెండు ప్రాంతాల్లో మిగిలిన స్థానాలను ప్రభావితం చేసేలా సిద్ధరామయ్య ప్రచారం చేస్తున్నారు. ప్రీపోల్ సర్వేలు అంచనాలు తలకిందులు చేసేలా ఉండడంతో మరిన్ని సమీకరణలపై దృష్టిపెట్టిన సిద్ధరామయ్య సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. మోదీ పాలనలో వైఫల్యాలను తనదైన స్టైల్లో పదేపదే చెబుతూ జనాన్ని ఎట్రాక్ట్ చేస్తున్నారు సిద్ధరామయ్య.


మే 12న 224 స్థానాలకు జరగనున్న పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీ  ఏ పార్టీతో పొత్తులేకుండా బరిలోకి దిగుతుంది.ప్రచారబాధ్యతల నుంచి ఎన్నికల వ్యూహాల వరకూ అన్నింటినీ తానే  చూసుకుంటున్న సిద్ధరామయ్య..గెలుపోటములకు తనదే బాధ్యత అన్నట్టు వ్యవహరిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: