గవర్నర్ నరసింహన్ పై వేటు ఖాయం..!?

Vasishta

తెలుగు రాష్ర్టాల్లో ఇప్పుడు గవర్నర్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ గవర్నర్ మాకొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్.. ఇక్కడ బీజేపీ పోటాపోటీగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్ కు గవర్నర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇటీవలే టీకాంగ్రెస్ బాహాటంగా విమర్శలు చేస్తే.. ఏపీలో బీజేపీ నేతలు ఏకంగా గవర్నర్ నే మార్చాలంటున్నారు. గవర్నర్ నరసింహన్ తన పరిధి దాటి కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు తెలుగురాష్ర్టాల్లో హాట్ టాపిక్ గా మారాయి.


తెలుగురాష్ర్టాల్లో రాజకీయ పార్టీలకు గవర్నర్ నరసింహన్ టార్గెట్ గా మారారు. సుదీర్ఘకాలంగా తెలుగు రాష్ర్టాల్లో పనిచేస్తున్న గవర్నర్ నరసింహన్ పై ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తే.. ఏపీలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్రాజు ఏకంగా ఈ గవర్నర్ మాకొద్దంటూ సంచలన ఆరోపణలు చేయడంతో తెలుగురాష్ర్టాల్లో గవర్నర్ పాత్ర పై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. గవర్నర్‌ నరసింహన్‌ను వెంటనే మార్చాలని విష్ణుకుమార్‌ రాజు డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాల్లోపు కొత్త గవర్నర్‌ను నియమించాలని  అల్టిమేటం జారీచేశారు. రెండు రాష్ట్రాల గవర్నర్ గా గురుతర బాధ్యతలు ఉన్నప్పటికీ.. గవర్నర్ నరసింహన్ ఏపీ గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదనేది బీజేపీ నేతల వాదన. నవ్యాంధ్ర గురించి ఏమాత్రం పట్టించుకోకుండా.. తెలంగాణ కోసమే ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రగతి మీద ఏమాత్రం శ్రద్ధలేని ఇలాంటి గవర్నర్ తమకొద్దంటూ .. వెంటనే ఆయన్ను తొలగించి.. కొత్త గవర్నర్ ను నియమించాలని రాష్ట్రంలో బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.


మూడున్నరేళ్లుగా విభజన హామీలపై శ్రద్ధచూపని గవర్నర్ తీరును సమయం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తున్న బీజేపీ నేతలు.. ఇప్పుడు ఓపెన్ అయిపోయారు. ఇందుకారణం.. ఏపీ ప్రభుత్వం రూపొందించిన నాలా బిల్లు విషయంలో గవర్నర్‌ తీరుపై వివాదం నడుస్తోంది.  నాలా బిల్లుపై గవర్నర్ నరసింహన్‌కు ఏపీ సర్కార్‌కు మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది.. 3 నెలల కిందట పలు సలహాలు చేర్చి.. నాలా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నరసింహన్ కు పంపింది. అయితే ఏపీ ప్రభుత్వం సలహాలను గవర్నర్ తోసిపుచ్చి దాన్ని తిప్పిపంపారు. దీంతో ఈ బిల్లుపై అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ను ఆమోదించి.. గవర్నర్‌ నరసింహన్ కు ప్రభుత్వం మరోసారి పంపింది. కానీ గవర్నర్ మళ్లీ ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎట్టకేలకు ఆ బిల్లును ఆమోదించినప్పటికీ .. గవర్నర్ నరసింహన్ ను సాగనంపాలనే పట్టుదలతోనే  ఉంది బీజేపీ రాష్ర్టనాయకత్వం.


ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా గవర్నర్ నరసింహన్ పై తీవ్ర విమర్శలు చేయడం ఈ సందర్భంగా చర్చించుకోవాల్సిన అంశం. గవర్నర్ టీఆర్ ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు.  ఇసుక మాఫియా గురించి గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకే వెళ్లిన టీ కాంగ్రెస్ నేతలను ..గవర్నర్   మీ టైంలో ఇసుక మాఫియాలేదా అని కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్ నుంచి ఊహించని పంచ్ తిన్న కాంగ్రెస్ నేతలు ఆ తర్వాత తేరుకుని గవర్నర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసారు. గవర్నర్ ఎదుటే అసంతృప్తి వెళ్లగక్కిన నేతలు..ఇక గవర్నర్ ను కలవమంటూ ఆ మధ్య శబధాలు కూడా చేశారు.


వాస్తవానికి యూపీఏ హయాంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన గవర్నర్ నరసింహన్ కు .. విభజన తర్వాత కూడా రెండురాష్ర్టాల బాధ్యతలను అప్పగించింది కేంద్రం..ఆ మధ్య గవర్నర్ మారతారనే ప్రచారం జరిగినా  కేంద్రం.. నరసింహన్ ను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే గవర్నర్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తున్న తెలంగాణ, ఏపీలోని కొన్ని రాజకీయ పార్టీలు ఈ గవర్నర్ మాకొద్దంటూ విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ పాలనాపరమైన అంశాలతో పాటు ,కొన్ని  రాజ్యాంగ విశిష్ట అధికారాలు  గవర్నర్ కు ఉన్నాయి. ఈ విషయంలో గవర్నర్ తన విచక్షణతో ఆయా అంశాలలో కల్పించుకునే హక్కు ఆయనకు ఉంది. ఈ కోణంలో.. గవర్నర్ నిర్ణయాలు కొన్ని పార్టీలకు రుచించకపోవచ్చు... అయినా కొన్ని విషయాల్లో గవర్నర్ నిర్ణయమే ఫైనల్...


రాష్ట్ర వ్యవహారాల పరిపాలనలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 159 ప్రకారం, రాజ్యాంగం మరియు చట్టాన్ని కాపాడటం, రక్షించడం గవర్నర్ యొక్క ప్రాథమిక విధి. రాజ్యాంగ నిబంధనలను అమలు పరచడానికి ఒక రాష్ట్రం యొక్క కార్యనిర్వాహక మరియు శాసన సంబంధిత సంస్థలపై చర్యలకైనా, సిఫార్సులు చేయడానికైనా, పర్యవేక్షించేందుకైనా గవర్నర్ తన అధికారులు ఉపయోగించుకోవచ్చు. ఇలా అనేక అంశాలలో గవర్నర్ అధికారులు విస్తృతమే అయినా.. అనేక సందర్భాల్లో గవర్నర్లు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలకు అనుకూలంగానే వ్యవహరిస్తారనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి.  అయితే ప్రస్తుతం మరోసారి గవర్నర్ చుట్టూ జరుగుతున్న రాజకీయ విమర్శలకు కేంద్రం ఎలాంటి పుల్ స్టాప్ పెడుతుందో వేచిచూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: