మెజార్టీ స్థానాలు జగన్వే: లగడపాటి

 హైదరాబాద్: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎప్పటిలాగే తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించారు. ఆయన అంచనా ప్రకారం మెజార్టీ స్థానాలను జగన్ వర్గం అభ్యర్థులు కైవసం చేసుకుంటారన్నారు. పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలలో వైఎస్ఆర్ పార్టీ 12నుంచి 16 స్థానాల వరకు గెలువ వచ్చన్నారు. నెల్లూరు పార్లమెంటు సీటు విషయం మాత్రం చెప్పలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఒకటి నుంచి 3, టీడీపీ జీరో నుంచి 2 వరకు, టీఆర్ఎస్ ఒక స్థానంలో గెలిచే అవకాశాలున్నాయన్నారు. టీడీపీకి ఒక సీటు కూడా రాకపోయినా ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. ఈ ఫలితాలు జగన్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ తమ సర్కార్ కు వచ్చిన ముప్పు ఏమీ లేదన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో జగన్ తన చివరి అస్ర్తమైన తల్లీ విజయమ్మ, సోదరి షర్మిలను వాడుకున్నారనీ అన్నారు. అబద్దాల పునాదులపై పురుడు పోసుకున్న జగన్ పార్టీ ఉప ఎన్నికల్లోనూ అన్నీ అబద్దాలు ప్రచారం చేసిందనీ, చివరకు రాజశేఖర్ రెడ్డి మరణంపై కూడా తప్పుడు ప్రచారాన్ని చేసిందన్నారు. మోసం చేసి ఒకసారి అధికారంలోకి రావచ్చనీ, ఎల్లకాలం ఇట్లే వస్తామనుకుంటే కుదరదన్నారు. 1999లో మోసాలతో టీడీపీ నేత చంద్రబాబు అధికారంలోకి వచ్చాడనీ, తరువాత ఏమైందో అందరికీ తెలుసుననీ, జగన్ పరిస్థితి కూడా అంతేననీ అన్నారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను జగన్ గెలుచుకోవచ్చు, భవిష్యత్ అంతా ఇలాగే ఉంటుందని అనుకోవడం పొరపాటన్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలతో రాష్ర్ట విభజనకు ముడిపెట్టలేమన్నారు. మొత్తానికి ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో ఆత్మస్థయిర్యాన్ని మాత్రం పెంచిందనీ రాజగోపాల్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: