4 మహా నగరాలకు ముంచుకొస్తున్న ముప్పు..! ఏం జరగబోతోంది..??

Vasishta

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు. అయితే ఇది పాత మాట. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడులు నగరాలే.! సగానికిపైగా ఆదాయం నగరాల నుంచే సమకూరుతోంది. అయితే ఇటీవలికాలంలో నగరాలు నరకానికూ ఆవాసాలుగా మారాయి. ముఖ్యంగా నగరాలనే టార్గెట్ గా చేసుకుని వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు.


          ముంబై, హైదరాబాద్, బెంగళూరు.. గత పక్షం రోజుల్లో ఈ నగరాలపై వరుణుడు పగబట్టాడు. ముంబైలో కుండపోత వర్షానికి జనజీవనం ఏ స్థాయిలో స్తంభించిందో చూశాం. రెండ్రోజులపాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరం మొత్తం వరదల్లో మునిగిపోయిందా అన్నట్టు కనిపించింది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది.


          ఆ తర్వాత హైదరాబాద్ లో కుండపోత వర్షాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆరేడు గంటలపాటు కురిసిన భారీ వర్షాలకే నగరం చిగురుటాకులా వణికిపోయింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇళ్లలోకి మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. మూడ్రోజులపాటు ఏమీ చేయలేని నిస్సహాయత. ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ చూస్తూ ఉండిపోయారు కానీ స్పందించేందుకు ఏమీ లేదు.


          ఇప్పుడు వరుణుడు బెంగళూరుపై పగపట్టారు. రెండ్రోజులుగా అక్కడ కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని జనజీవనం అస్తవ్యస్తమైంది. ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో భారీ వర్షాలు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోయి ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుందరనగరంగా పేరొందిన బెంగళూరులో ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు. గతంలో చెన్నైపైన కూడా వరుణ ప్రతాపం చూపిన సంగతి తెలిసిందే.


          ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. ఇలా మహానగరాలన్నింటిపైనా ప్రకృతి కన్నెర్రజేసిందా..! అడ్డదిడ్డంగా ప్రకృతి వనరుల వినాశనమే నగరాలపై ప్రకృతి పగబట్టడానికి కారణమా..? సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, పర్యావరణంపై ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడం... లాంటి కారణాలే ప్రస్తుతం నగరాలు వైపరీత్యాలు ఎదుర్కోవడానికి కారణమా..? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోకపోతే మహానగరాలకు ముప్పు తప్పదేమో..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: