నంద్యాల గడ్డపై సీఎం చంద్రబాబు .. ఏమన్నారో తెలుసా..?

Vasishta

నంద్యాల ప్రచారం మరో అంకానికి చేరుకంది. ఇప్పటివరకూ ప్రతిపక్షనేత మాత్రమే నంద్యాలలో మకాం వేసి ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఇవాల్టి నుంచి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రచారం ప్రారంభించారు. దీంతో నంద్యాల పోల్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది.


ఉపఎన్నిక ప్రచారం కోసం కడప నుంచి నంద్యాల చేరుకున్న చంద్రబాబు.. అయ్యలూరులో రోడ్డుషోలో పాల్గొన్నారు. భూమా బ్రహ్మానంద రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నంద్యాలలో అభివృద్ధి జరిగిందంటే.. అది టీడీపీ హయాలోనే అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నంద్యాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగినట్టు సీఎం చెప్పారు.


నాడు భూమా నాగిరెడ్డి నంద్యాల అభివృద్ధి కోసమే టీడీపీలో చేరారని చంద్రబాబు గుర్తు చేశారు. నంద్యాలలో రోడ్లు ఇరుకుగా ఉన్నాయని, మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగాలేదని.. పేదలకు ఇళ్లు లేవని నాటు భూమా నాగిరెడ్డి చెప్పగానే పూర్తి చేసేందుకు హామీ ఇచ్చానన్నారు. నంద్యాల అభివృద్ధి గురించే ఆయన ఎప్పుడూ మాట్లాడేవారన్నారు.


పదేళ్లపాటు కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఇప్పుడు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇక్కడేమైనా అభివృద్ధి జరిగిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. నంద్యాల అభివృద్ధి గురించి ఏనాడూ మాట్లాడని వ్యక్తికి ఈరోజు ఓట్లు అడిగే హక్కుందా అని బాబు నిలదీశారు.


‘16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌తో రాష్ట్ర ప్రయాణం మొదలైంది. ఆదాయం బాగున్నప్పటికీ నంద్యాలలో అభివృద్ధి జరగలేదు. టీవీ, పేపర్, డబ్బులు లేవని చెబుతున్న వ్యక్తిని మనం నమ్మొచ్చా? నా అనుభవం మీ కోసమే.. రాష్ట్రం కోసమే కష్టపడుతున్నాను. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా పరుగులు పెట్టిస్తున్నాను. రైతుల కోసం 24వేల కోట్లు మాఫీ చేసిన ప్రభుత్వం ఇది. మిగులు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఈ స్థాయి రుణమాఫీ జరగలేదు. నేను రైతు బిడ్డను కాబట్టి.. రైతుల మీద ఉన్న ప్రేమతో రుణమాఫీ చేశాను’ అని చంద్రబాబు చెప్పారు.


ఉపఎన్నిక ప్రచారానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అఖిలప్రియ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రూ.1500 కోట్లతో నంద్యాలను కొత్త పెళ్లి కూతురులాగా తయారు చేశారని చెప్పారు. నాన్న భూమా నాగిరెడ్డి ఉంటే ఎంతో సంతోషించేవారని అఖిలప్రియ అన్నారు.


ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి.. ప్రతిపక్షాలకు విమర్శించడానికి కారణాలు ఏవీ లేక వ్యక్తిగతంగా దూషిస్తున్నారని అఖిలప్రియ విమర్శించారు. ముఖ్యమంత్రిని కాల్చి చంపాలి., ఉరి తీయాలని జగన్ మాట్లాడుతున్నారు.. పేదవారికి ఇళ్లు కట్టిస్తున్నందుకు, ఆడపడుచులకు రుణాలు కల్పిస్తున్నందుకు, నంద్యాలను అభివృద్ధి చేస్తున్నందుకు చంద్రబాబును ఉరి తీయాలా అని జగన్ ప్రశ్నిస్తున్నట్టు అఖిలప్రియ చెప్పారు. శిల్పా మోహన్ రెడ్డిని మీ ఓటుతో నంద్యాల నుంచే కాకుండా కర్నూలు జిల్లాలోనే లేకుండా తరిమేయాలని పిలుపునిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: