ఏపీకి మరో ఛాన్స్ ఇవ్వబోతున్న మోదీ.!?

Vasishta

          ఎన్నికలు సమీపిస్తున్నాయి. నిర్దిష్ట గడువు కంటే ముందే ఎన్నికలకు వెళ్లాలని మోదీ ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి టీమ్ ను తన దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారు మోదీ. అందులో భాగంగా త్వరలోనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారు. ఈ టీమ్ లో ఏపీ నుంచి మరొకరికి ఛాన్స్ దక్కనుంది.


          ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే మంత్రివర్గాన్ని పునర్య్వవస్థీకరించబోతున్నారు. ఈ నెలాఖరులోపే ఈ విస్తరణ ఉండొచ్చని కేంద్రం నుంచి వస్తున్న సమాచారం. కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోయారు. మనోహర్ పారికర్ నిర్వహించిన రక్షణ శాఖ ఇప్పుడు జైట్లో వద్ద ఉంది. అనిల్ దవే హఠాన్మరణంతో ఖాళీ అయిన అటవీ,పర్యావరణ శాఖలను కూడా ఇతరులకు సర్దాల్సి ఉంది.


          కేంద్ర మంత్రి వెంకయ్య ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కావడం, ఆయన ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోవడంతో ఆయన స్థానాన్ని మళ్లీ ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తితోనే భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రేసులో విశాఖపట్నం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ముందంజలో ఉన్నారు. ఏదైనా అనూహ్య నిర్ణయం జరిగితే తప్ప హరిబాబుకు కేబినెట్ లో బెర్త్ దక్కడం ఖాయం.


          హరిబాబుతో పాటు రాష్ట్రానికే చెందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ కూడా రేసులో ఉన్నారు. పార్టీకి రాం మాధవ్ అందించిన సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలను మోదీ – షా భావిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే రాం మాధవ్ ను కేబినెట్ లోకి తీసుకోవడంతో పాటు అత్యంత కీలక శాఖను కూడా కట్టబెట్టే అవకాశం ఉంది.


          అయితే అమిత్ షాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు మోదీ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో రాం మాధవ్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే జరిగితే హరిబాబుకు కేబినెట్ పీఠం ఖాయం. ఒకవేళ హరిబాబుకు అవకాశం లేకపోతే మిత్రపక్షమైన టీడీపీ నుంచి మరో ఎంపీని మంత్రి పదవికి పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే – టీడీపీ మాత్రం తమకు మంత్రి పదవి అవసరం లేదని, తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులిస్తే చాలని వేడుకుంటోంది. మరి చూద్దాం.. ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: