విజయమ్మ రాకతో మారిన పరకాల సీన్

 హైదరాబాద్: వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాకతో పరకాల ఉప ఎన్నికల చిత్రం పూర్తిగా మారిపోయింది. మొన్నటి వరకు ఇక్కడ తెరాస-బీజేపీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని అందరూ భావించారు. అయితే, శుక్రవారం నాడు పరకాల నియోజక వర్గంలో విజయమ్మ, షర్మిల పర్యటన అనంతరం అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా విజయమ్మ, షర్మిలలకు పరకాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వారు పర్యటించిన అన్ని ప్రాంతాలలో ప్రజలు తమ ఆప్యాయతను పంచారు. అక్కున చేర్చుకున్నారు. వేలాదిగా ప్రజలు తరలి రావడంతో పరకాలలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ఇతర పార్టీలకు ఏమీ తీసిపోని విధంగా ఉందనేది తేలిపోయింది. విజయమ్మ, షర్మిల రాకముందు పరకాలలో తెరాస-బీజేపీ మధ్య పోటీ ఉండగా, ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెరాస-వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని తెరాసకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. ఎన్నికల పోలింగ్ కు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో పరకాలలో రాజకీయ పరంగా ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు తెరాస-వైఎస్ఆర్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఏర్పడింది. పరకాలలో ఎవరూ ఊహించని విధంగా కొండా సురేఖ పుంజుకుంటుండటంతో తెరాస తన వ్యూహాన్ని మారుస్తోంది. ఎలాగైనా పరకాలలో గెలువాలనే ఏకైక లక్ష్యంతో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. మొత్తానికి పరకాలలో నువ్వా-నేనా అనే విధంగా పరకాలలో ఏర్పడింది. విజయమ్మ, షర్మిలల పర్యటన విజయవంతం కావడంతో తన విజయం సులువైందని కొండా సురేఖ ధీమాతో వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: