నన్ను భయపెట్టే దమ్ము వారికి మాత్రమే ఉంది: బాబు...!!

Shyam Rao
ఓటుకు నోటు కేసు తెలుగు దేశం పార్టీని ఎంత కలవరపెట్టిందో మనందరికీ తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే  స్టీఫెన్ సన్ కి లంచం ఇవ్వజూపిన సమయంలో తీసిన వీడియో ఆధారంగా రెడ్ హ్యాండెడ్ గా రేవంత్ రెడ్డి దొరికిపోయారు. ఆ తర్వాత రేవంత్ అరెస్ట్ కావడం, ఆయన్ని జైలుకు పంపడం, కొన్ని రోజుల తర్వాత ఆయన్ని బెయిల్ పై విడుదలజేయడం జరిగిపోయాయి. 



అయితే ఈ కేసులో కీలక సూత్రధారి అయిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హస్తం ఉందని తేలడంతో బాబు ఒక్కసారిగా షాక్ కు గురవ్వడం, ఆ తర్వాత కేంద్రం కాళ్లా వెళ్లా పడి ఏదో విధంగా బయటపడడం జరిగింది. అయితే ఈ కేసు మళ్లీ పునర్విచారణకు రావడంతో బాబు జైలుకు వెళ్లడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యేలు ఊదరగొడుతున్న సమయంలో బాబు ఈ విషయంపై స్పందించారు. ‘నేనేదో కేసులకు భయపడుతున్నానని ప్రచారం చేస్తున్నారు. నా మీద ఎలాంటి కేసులు లేవు. నాపై కేసులు పెట్టే ధైర్యం ఎవరికి ఉంది. 25 కేసులు పెట్టారు.



కోర్టుకు పోతే కొట్టేశారు. ఎవరు ఎన్నిసార్లు కోర్టుకు పోయినా ఏ కోర్టు నన్ను తప్పుపట్టలేకపోయిందంటే అది నా క్రమశిక్షణ నా నిబద్ధత’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. తాను ప్రజలకు తప్ప మరెవరికీ భయపడనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తనకు హైకమాండ్ ఎవరూ లేరని, తనకు ప్రజలే హైకమాండ్ అని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు సహా పలువురు కాంగ్రెస్, వైసీపీ జిల్లా నేతలు శుక్రవారం రాత్రి చంద్రబాబు నివాసంలో టీడీపీలో చేరారు. 



ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రజల జీవితాల్లో మార్పు తేవడం ఒక్క టీడీపీతోనే సాధ్యమన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చి చూపిస్తానని పేర్కొన్నారు. అభివృద్ధిని ఓర్వలేని కొందరు వాళ్ల ఊరికి నీరు ఇస్తామన్నా వద్దని అంటున్నారని బాబు విమర్శించారు. ప్రజలు అభివృద్ధి చెందితే వారి మాట ఎక్కడ వినరోననేది వారి భయానికి కారణమన్నారు. భవిష్యత్తులో రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లకు నీరు అందిస్తామన్నారు. అవినీతి రహిత పాలనే తన ధ్యేయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో పోరాడుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: