తెలంగాణావాదుల ఒత్తిడికి లొంగిపోయిన చంద్రబాబు!

Durga
         దేశాధిపతిగా, సైనిక కమాండర్ గా, రాజ్యాంగ అధిపతిగా భావించే రాష్ట్రపతి ఎన్నికకు జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొన కూడదని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ విమర్శల పాలవుతోంది. చంద్రబాబునాయుడు తెలంగాణా ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి లొంగి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేయకూడదని నిర్ణయించారని సీమాంధ్ర టీడీపీ ప్రజా ప్రతినిధులు విమర్శించారు.  ఒకప్పుడు అబ్ధుల్ కలాం ను రాష్ట్రపతిగా తానే చేశానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబునాయుడు ప్రస్తుతం డిఫెన్స్ లో పడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ తెలంగాణా వ్యతిరేకిఅని, సంగ్మాకు మతత్వ బీజేపీ, మద్దతు ఇస్తున్నందువల్ల ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.  నిజానికి ప్రణబ్ ఎప్పుడూ తెలంగాణాకు వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. అలాగే గతంలో తమ పార్టీ బీజేపీ తో చెట్టాపట్టాల్ వేసుకుతిరిగిన విషయం అందరికి తెలిసిందేనని, బీజేపీ మద్దతు ఇచ్చినంత మాత్రాన సంగ్మా మతతత్వవాది అయిపోతారా? వారు ప్రశ్నిస్తున్నారు.  చంద్రబాబునాయుడు చెబుతున్నవన్నీ కుంటిసాకులేలని, తెలంగాణా ప్రజా ప్రతినిధుల వత్తిడికి ఆయన లొంగిపోయాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా వాదులను సంతృప్తి పర్చడానికి తమ ఓటు హక్కును కాలరాయడం ఎంత వరకూ సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.  రాష్ట్రముఖ్యమంత్రిగా తొమ్మిది ఏళ్లు పరిపాలించిన చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండటం ఆయన అవకాశవాద రాజకీయాలను ప్రతిభింబిస్తుందని రాజకీయవాదులు ఆరోపిస్తున్నారు. ఓటువినియోగించుకోకపోవడం అంటే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడమేనని మేధావులు మండిపడుతున్నారు.  తెలంగాణ టీడీపీ నాయకులు కూడా ప్రత్యేక తెలంగాణా పేరుతో రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండడం సరైన నిర్ణయం కాదనే వాదనలు వినవస్తున్నాయి. ఏదిఏమైనా రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండటం అనేది మన రాష్ట్రంనుండే మొదలవ్వడం చూస్తుంటే రాష్ట్రరాజకీయాలు ఎంతగా భ్రష్టుపట్టాయో తెలస్తుందని రాజకీయ పండితులు వాపోతున్నారు.  దీనినే ఆదర్శంగా తీసుకుని ప్రజలు రాజకీయ పార్టీలకు ఓట్లు వేయకుండా ఉంటే రాజకీయ పార్టీల భవిష్యత్ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: