వ్యవస్థను మారుద్దాం !

Ravi Chandra
రాజకీయాల్లో యువతకు తగిన పాత్ర కల్పించేలా వ్యవస్థను సమూలంగా మార్చివేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. తమను రాజకీయాలకు దూరంగా ఉంచినట్టుగా యువత భావిస్తోందని చెప్పారు. కొందరు మాత్రమే రాజకీయాలను నియంత్రిస్తున్నారని, అధికారం అత్యధికంగా కేంద్రీకృతమైందని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రాల్లో, రాజకీయ పార్టీల్లో అధికారం కేంద్రీకృతమైందని చెప్పారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ, భారతదేశ ప్రజలే తన జీవితమని ప్రకటించారు. దేశాన్ని నడిపించగలిగే 40 నుంచి 50 మంది నాయకులను తయారు చేయాల్సి ఉందని, అలాగే ప్రతి రాష్ట్రానికి 5 నుంచి 10 మంది నేతలు మనకు కావాలన్నారు. వీరిలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత నెహ్రూ, పటేల్, ఆజాద్ వంటి ఉద్ధండులు కాంగ్రెస్‌కున్నారని రాహుల్ గుర్తుచేశారు. అధికారం కోసం మనం పాకులాడకూడదని, సాధికారత కోసం దాన్ని వినియోగించాలంటూ రాహుల్ ఉద్వేగంగా వ్యాఖ్యానించినప్పుడు సోనియా, మన్మోహన్ సహా ప్రతినిధులంతా లేచి నిలబడి హర్షం వ్యక్తం చేశారు. కొందరు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లోకి వస్తారని, ఎన్నికల్లో ఓడిపోయాక తిరిగి ఇదివరకటి పార్టీలోకే వెళ్లిపోతారని చెప్పారు. మన పార్టీ కార్యకర్తలు మాత్రం అలాగే ఉండిపోతారని తెలిపారు. ఈ పద్ధతి మారాలన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: