'జనవరి 26' వేడుకల్లోనే తెలంగాణ ప్రకటన?

Devi Priya
తెలంగాణ అంశం తేల్చేందుకు తీవ్ర కసరత్తులు చేసి ఫైనల్ గా ఓ నిర్ణయానికి వచ్చిన కేంద్రం.. ఆ ప్రకటన చేసేందుకు రెడీ అవుతోంది. అయితే జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగానే తెలంగాణ ప్రకటన చేసే అవకాశం ఉందని ఢిల్లీలో జోరుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలోనే తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు వినిపిస్తోంది. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ప్రకటన చేర్చడం వల్ల తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ మళ్లీ వెనక్కి తగ్గుతుందనే అభిప్రాయం కలగకుండా జాగ్రత్తపడాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో డిసెంబర్ తొమ్మిదిన అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి మళ్లిందనే విమర్శలున్నాయి. దానివల్ల కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినా మళ్లీ వెనక్కి వెళ్లదనే గ్యారంటీ ఏమీ లేదనే అభిప్రాయం కలుగుతుందని, రాష్ట్రపతి ప్రసంగంలో ఆ ప్రస్తావన చేస్తే వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదనే అభిప్రాయాన్ని బలంగా నాటవచ్చునని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య లేవనెత్తితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం కేంద్రం.. డీజీపీ దినేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమ్యాథ్యూలను ఢిల్లీకి పిలిచి సమావేశమయ్యారు. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు నేపథ్యంలో వీరి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: