విజయమ్మ పరకాల పర్యటనపై సర్వత్ర ఉత్కంఠ

విజయమ్మ పరకాల పర్యటనపై సర్వత్ర ఉత్కంఠ హైదరాబాద్, 05,జూన్: పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కూతురు షర్మిల పర్యటన ఖరారైంది. ఈ నెల 8,9తేదీలలో వాళ్లిద్దరూ పరకాలలో పర్యటించనున్నారు. వారి పర్యటనకు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. అయితే, ఈ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో అడుగుపెట్టే ముందు వైకాపా పార్టీ నేతలు తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పి రావల్సిందిగా తెలంగాణ జేఏసీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. అటు రాజకీయ జేఏసీ, ఇటు టీఆర్ఎస్ ఇరువురు వైకాపాకు వార్నింగ్ ఇవ్వడంతో పరకాలలో వైకాపా పార్టీ నేతల ప్రచారం ఎలా సాగుతుందనే దానిపై అందరిలోనూ టెన్షన్ మొదలైంది. పరకాలలో వైకాపా పార్టీ అభ్యర్థి కొండా సురేఖకు మద్దతుగా ఆ ఇరువురు మహిళా నేతలు రెండు రోజుల పాటు పరకాల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణలోని పరకాల ఎన్నికల పర్యటన వచ్చే ముందు వైకాపా పార్టీ నేతలు విజయమ్మ తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించిన తరువాతనే మానుకోటలో అడుగుపెట్టాల్సిందిగా అటు తెలంగాణా రాజకీయ జేఏసీ, ఇటు టీఆర్ఎస్ హెచ్చరికలను జారీ చేసింది. సరిగ్గా రెండేళ్ల కిందట వైకాపా పార్టీ అధ్యక్షుడు జగన్ మానుకోట పర్యటనకు వచ్చే ముందు కూడా టీఆర్ఎస్, తెలంగాణ రాజకీయ జేఏసీ ఇలాంటి హెచ్చరికలనే జారీ చేసింది. తెలంగాణపై వైఖరిని చెప్పకుండా వస్తే అడ్డుకుంటామని చెప్పింది. అప్పుడు అన్నంత పని చేసింది. టీఆర్ఎస్ ఇప్పుడు కూడా వైకాపా పట్ల రెండేళ్ల కిందట అనుసరించిన వైఖరిని అవలంభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు, పోలవరం ప్రాజెక్టుపై వైకాపా స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పిన తరువాతనే తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనిస్తామనీలేదంటే రెండేళ్ల కిందట జగన్కు ఏ పరిస్తితులు ఎదురయ్యాయో ఇప్పుడు విజయమ్మకు అదే పరిస్థితులు ఎదురవుతాయనీ టీఆర్ఎస్,తెలంగాణ జేఏసీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయోననీ అందరూ భయపడుతున్నారు.రెండేళ్ల కిందటి మానుకోట గాయం మాని పోకముందే మరలా మరో ఘటన చోటుచేసుకుంటుందా?అనేది అందర్ని వెంటాడుతోంది. మానుకోట ఘటన వైకాపాను ఇప్పటికీ పట్టి పీడిస్తున్న క్రమంలోనే పరకాల ఉప ఎన్నిక రూపంలో మరొకటి వచ్చింది. తెరాస నాయకుడు, పరకాల ఉప ఎన్నికల ఇంఛార్జి తన్నీరు హరీష్ మరో అడుగు ముందుకేశాడు. వైకాపా నాయకురాలు విజయమ్మ ముమ్మాటికీ ఆంధ్ర మాతేననీ ఘాటైన విమర్శనాస్త్రనాలను సంధిస్తున్నారు. తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే ముందు తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టుపై చెప్పి రావాలనీ, లేకుంటే అడ్డుకుని తీరుతామంటున్నారు.హరీష్ బామరిది కేటీఆర్ ఇంకో అడుగు ముందుకేసి తెలంగాణ వెళ్లాలంటే దివంగత రాశేఖర్ రెడ్డి వీసా తీసుకోవాలన్నారు. ఇప్పుడు విజయమ్మ వీసా తీసుకుని తెలంగాణలో అడుగుపెడుతుందా?అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా టీఆర్ఎస్ నాయకులు కాస్త కఠినంగా మాట్లాడుతుండటంతో... మానుకోటపై మరలా జరగకూడని ఘటనలు ఏమైనా జరుగుతాయా?అనే దానిపై సర్వత్రా చర్చనీయాశంగా మారింది. వైకాపా పట్ల టీఆర్ఎస్, తెలంగాణ రాజకీయ జేఏసీ అవలంభిస్తోన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడుతున్న పార్టీ అన్ని పార్టీల పట్ల ఒకే వైఖరిని అవలంభించకుండా భిన్న వైఖరులను అవలంభిస్తుందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్, అడ్డుపడుతున్న టీడీపీనీ వదిలిపెట్టి వైకాపాను టార్గెట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయాన్ని వైకాపా లేవనెత్తుతున్నది. తమ పార్టీ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో లేదనీ, తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తామంటే తాము అడ్డుకోబోమనీ ఇప్పటికే ప్రకటించామని వైకాపా నేతలంటున్నారు. ఇదే విషయాన్ని ప్లీనరిలో చెప్పామనీ, తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టలేదని గుర్తు చేస్తన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించే తమ పట్ల టీఆర్ఎస్, తెలంగాణ రాజకీయ జేఏసీ తీసుకున్న నిర్ణయం సముచితంగా లేదనేది వైకాపా అభిప్రాయం. తెలంగాణను అడ్డుకుంటున్న పార్టీలను యధేచ్చగా పరకాలలో ప్రచారం చేయించుకోనిచ్చిన వాళ్లు తమకు అడ్డుతగులుతామనడం సమంజసంగా లేదనేది వైకాపా వాదన. వైకాపా పట్ల టీఆర్ఎస్, తెలంగాణ రాజకీయ జేఏసీ మొదటి నుంచీ ఒకే విధమైన వైఖరితో వుంది. దీనిపై పలువురికి అనుమానం కలుగుతోంది. ఒక పార్టీ పట్ల ఒక విధంగా, ఇంకో పార్టీ పట్ల మరో విధంగా ఉండటాన్ని వైకాపాతో పాటు మరి కొందరూ తప్పుబడుతున్నారు. వైకాపా పట్ల టీఆర్ఎస్ అవలంభిస్తోన్న ఏకపక్ష, పక్షపాత ధోరణిని మానుకోవాలనీ ఆ పార్టీ హితవు పలుకుతోంది. మొత్తానికి వైకాపా నేతల ప్రచారానికి గడువు సమీపిస్తున్న కొద్దీ ఏం జరగబోతోందోనని అందరిలోనూ ఒకింత టెన్షన్ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: