ఆ‘జాదు’ మాటలకు అర్థాలే వేరులే...
పార్టీలో ఉంటే పదవులు...పార్టీ వీడితే జైలుకా:వైకాపా సూటి ప్రశ్న
హైదరాబాద్, జూన్, 05: వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అనేక సందేహాలకు తెరలేపింది. అంతే కాకుండా,రాజకీయ వర్గాల్లో కలకలంరేపుతున్నాయి. జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే తొలుత కేంద్ర మంత్రిని, తరువాత ముఖ్యమంత్రిని చేసి ఉండే వాళ్లమంటూ ఆజాద్... తిరుపతి, నెల్లూరు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడిన తీరు అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చర్చనీయాంశంగా మారింది. ఆజాద్ వ్యాఖ్యలు ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. ఆజాదు వ్యాఖ్యలను టీడీపీ ఖండించింది. కాంగ్రెస్ మాత్రం ఆజాద్ వ్యాఖ్యల అర్థం వేరులే అంటోంది. వాస్తవానికి మాత్రం కాంగ్రెస్ను వీడినందుకే జగన్కు కష్టాలు వచ్చాయని అర్థం వచ్చే విధంగా మాట్లాడిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో ఉంటే ఆయనకు అనేక పదవులు వచ్చేవంటూ అర్థం వచ్చే విధంగా ఆజాదే స్వయంగా చెప్పడం చూస్తుంటే ఇప్పటి దాకా వైకాపా పార్టీ నేతలు చేస్తున్న వాదనకు బలం చేకూర్చినట్లయ్యింది. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడటం వల్లనే వేధింపులకు గురి చేస్తున్నారంటూ కొన్ని నెలలుగా ఆ పార్టీ వాదిస్తూ వస్తోంది. ఆ పార్టీ చెబుతూ వస్తున్నట్లుగానే తాజాగా ఆజాద్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ఎదురించినందుకే అక్రమ కేసులు బనాయించినట్లు జగన్ ముందు నుంచి చెబుతూ వస్తున్నాడు. అంతే కాకుండా, తన అరెస్టు గురించి ఆయనే ముందుగానే చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే జరిగింది. జగన్ అరెస్టుతో అనూహ్యా పరిస్థితుల్లో ప్రచార బాధ్యతలను చేపట్టిన విజయమ్మ, షర్మిల కూడా ఇదే విషయాన్ని ప్రజలకు చెబుతున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల మాటల్ని ఖాతరు చేయకుండా బయటకు వచ్చిన జగనన్నను కేసులతో వేధిస్తున్నారని చెబుతూనే...కాంగ్రెస్ లో ఉంటే కేంద్రమంత్రి పదవీ, రాష్ర్ట ముఖ్యమంత్రి పదవీ ఇచ్చే వాళ్లమంటూ తాజాగా ఆజాద్ చేసిన వ్యాఖ్యలనే షర్మిల లేవనెత్తుతున్నారు. కాంగ్రెస్ లో ఉంటే పదవులు...వీడితే జైలుకు పంపుతారా?అంటూ వాళ్లు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ లో ఉంటే జగన్ నిర్దోషి అయ్యేవాడట? పార్టీ వీడినందుకు ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సమంజసం మీరే చెప్పాలంటున్నారు. కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు, కుతంత్రాలకు మీరే న్యాయం చెప్పడంటూ విజయమ్మ,షర్మిల ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. మొత్తానికి పోలింగ్ సమీపించిన వేళ జగన్ను ఉద్దేశించి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆ తరువాత వాటిని ఆజాద్ సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు అది వేరే సంగతి.
మరింత సమాచారం తెలుసుకోండి: