కల్పన: మరో వికెట్ ఔట్

హైదరాబాద్: ‘దేశం’లో మరో కలకలం. సీమాంధ్రలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన పార్టీని వీడుతున్నారు. ఈమె పామర్రు నియోజకవర్గానికి చెందిన మహిళా నాయకురాలు. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని బాటలోనే ఈమె కూడా వైఎస్ఆర్ సీపీలో మరికొన్ని గంటల్లో చేరే అవకాశం వుంది. వైఎస్ఆర్ సీపీ నాయకులను కలవడంతో ఈమెను కూడా టీడీపీ నుంచి సస్పెన్షన్ చేశారు.  పొలిట్ బ్యూరో నుంచి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్న రెండో నాయకురాలు కల్పన. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యులు ఎంవీ.మైసూరారెడ్డి పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరిన విషయం విధితమే. తాజాగా ఉప్పులేటి కల్పన కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధమైంది. కొన్ని సంవత్సరాలుగా ఆమె టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహారిస్తున్నారు. కానీ, తన సామాజిక వర్గానికి పార్టీలో చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లభించడం లేదంటూ కల్పన గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు.  తమకు జరుగుతున్న అన్యాయంపై పార్టీ అధినేత బాబుకు ఎన్నిమార్లు చెప్పినా ఫలితం లేకపోయిందనీ కల్పన ఆరోపించింది. ఇక చేసేదేమీ లేకనే టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించింది. దీనితో ఆమెను సస్పెన్షన్ చేస్తున్నట్లు టీడీపీ ఆఘమేఘాల మీద మీడియాకు ప్రెస్ నోట్ పంపింది. అయితే, ఆమె వైఎస్ఆర్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోనున్నది. ఈమెదారిలో మరికొందరు పార్టీ నుంచి జంప్ కావడం ఖాయమని తెలుస్తోంది. నాని వెళ్లడంతో కొంత ఇబ్బందుల్లోపడ్డది టీడీపీ. ఇప్పుడు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు కల్పన కూడా పార్టీని వీడటం అనేది టీడీపీకి షాక్ అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: