వైసీపీ మాజీ మంత్రి అప్ప‌ల‌రాజు పొలిటిక‌ల్ తిప్ప‌లు... !

RAMAKRISHNA S.S.
వైసీపీకి చెందిన మాజీ మంత్రి, ప‌లాస మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్ప‌ల‌రాజుకు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పొలిటిక‌ల్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అప్ప‌ల‌రాజు తొలిసారి వైసీపీ వేవ్‌లో ఎమ్మెల్యే అయ్యి.. అనూహ్యంగా మంత్రి అయిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన మూడేళ్ల‌కే కాలం క‌లిసొచ్చి మంత్రి అయిన అప్ప‌ల‌రాజు వాపు చూసి బ‌లుపుగా ఫీల‌య్యార‌న్న చ‌ర్చ‌లు ఉత్త‌రాంధ్ర రాజ‌కీయ వర్గాల్లో ఉన్నాయి. ఇదంతా నా టాలెంట్‌.. నా టాలెంట్‌తోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యా.. నా టాలెంట్ చూసే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాకు మంత్రి ప‌ద‌వి ఇచ్చేశార‌ని ఆయ‌న డ‌బ్బాలు , గ‌ప్పాలు కొట్టుకోవ‌డ‌మే త‌ప్పా ఆయ‌న‌కు ప‌లాస రాజ‌కీయ క్షేత్రంలో బ‌లం అంటూ లేదు. ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణ‌లు క‌లిసి రావ‌డం, అటు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌డంతో అప్ప‌ల‌రాజు బూరెల బుట్ట‌లో ప‌డ్డారే త‌ప్పా ఆయ‌న ఎమ్మెల్యేగా అటు ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జల్లో, ఇటు మంత్రిగా శాఖ‌లో త‌న‌దైన ముద్ర వేసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌న్న చ‌ర్చ‌లే ఎక్కువుగా ఉన్నాయి. ఐదేళ్లు మంత్రిగా ఉన్న నియోజకవర్గానికి చేసింది సున్నా అన్నట్టు అప్పలరాజు రాజకీయం సాగిపోయింది.


ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో మంత్రిగా ఉండి కూడా ఏకంగా 40 వేల ఓట్ల భారీ తేడాతో ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఆయ‌న తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. పార్టీ కేడ‌ర్‌లో చాలా మంది అధికారం ఉన్నప్పుడే ఆయ‌న‌కు దూరంగా ఉన్నారు. ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో ఆయన మంత్రిగా ఉన్న‌ప్పుడు పెంచి పోషించిన అనుచ‌రులు ఇప్పుడు ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌లు, కేసుల్లో చిక్కుకోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఇమేజ్ చాలా వ‌ర‌కు డ్యామేజ్ అవుతోంది. వైసీపీకే చెందిన ప్రస్తుత పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు సీదిరి తీరుతో విబేధించి దూరంగా ఉంటున్నార‌న్న ప్ర‌చారం సొంత పార్టీ నేత‌ల్లోనే గ‌ట్టిగా వినిపిస్తోంది.


ఇక ఇద్ద‌రు మునిసిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ల‌లో ఒక‌రు ర‌క‌ర‌కాల ఫోర్జ‌రీ కేసుల్లో చిక్కుకుని పార్టీ ప‌రువు బ‌జారున పడేసిన ప‌రిస్థితి. మ‌రో వైస్ ఛైర్మ‌న్ ఏకంగా మరోసారి జంట పట్టణాల్లో గన్ కల్చర్ తెరపైకి తెచ్చి  రైల్వే ద్విచక్ర వాహనాలు పార్కింగ్ కాంట్రాక్ట‌ర్‌ను ఏకంగా తుపాకీ ఎక్కుబెట్టి  బెదిరించిన కేసులో ఏ 1 ముద్దాయిగా జైల్లో ఉన్న ప‌రిస్థితి. అప్ప‌ల‌రాజు మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న అనుచ‌రులు ఆ అధికారం అడ్డం పెట్టుకుని నియోజ‌క‌వ‌ర్గంలో భారీ మ‌ట్టి మాఫియాకు తెర‌లేపార‌న్న ఆరోప‌ణ‌లు ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో కొండ‌ల‌ను కొల్ల‌గొట్టి భారీగా అక్ర‌మార్జ‌న‌కు తెర‌లేపారు. ఇప్పుడు ఇవ‌న్నీ బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ‌ను ఎక్క‌డ కేసులు చుట్టుముట్టాడ‌తాయో ? అన్న భ‌యంతో వారంతా విల‌విల్లాడుతోన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం ప‌లాస వైసీపీలో క‌నిపిస్తోంది. మంద‌స మండ‌లం నల్లబడ్లూరులో కొండను అప్ప‌ల‌రాజు మంత్రిగా ఉన్న‌ప్పుడే కొల్ల‌గొట్ట‌డం మొద‌లైంది. దీనిపై కూడా ఇప్పుడు కేసులు భ‌యం స్థానిక వైసీపీ నాయ‌కుల్లో క‌నిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు సాగిన పైరవీలు ఇప్పుడు సాగకపోవడంతో ఒక్కొక్కరిగా వైయస్సార్సీపి కీలకనేతలు కేసులు పాలవుతున్నారు.


ఏదేమైనా అప్ప‌ల‌రాజు తొలిసారి ఎమ్మెల్యేగా గెల‌వ‌డం, ల‌క్‌లో మంత్రి కావ‌డం ఎంత వేగంగా జ‌రిగిపోయాయో... అంతే త్వ‌ర‌గా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌భ మ‌స‌క‌భార‌డం కూడా మొద‌లైంది. అందివ‌చ్చిన అవ‌కాశంతో నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా పాతుకుపోయే అవ‌కాశం ఉన్నా ఆయ‌న టైంలో నియోజ‌క‌వ‌ర్గంలో పెరిగిపోయిన అవినీతి, అన‌చ‌రుల పేట్రేగిపోవ‌డాల‌తో ప‌లాస జ‌నాల్లో చాలా మంది అభ‌ద్ర‌తా భావంతో ఉన్నామ‌ని ఆఫ్ ద రికార్డ్‌గా చెప్పుకుంటోన్న ప‌రిస్థితి. గ‌త నాలుగు ద‌శాబ్దాల్లో ఇక్క‌డ ఎంతోమంది ప్ర‌జాప్ర‌తినిధులు ఉన్నా ప‌లాస జ‌నాల‌కు దురుసు, దౌర్జ‌న్యాలు ఎప్పుడూ తెలియ‌వు. ఆ సంస్కృతి గ‌త పాల‌న‌లోనే ఇక్క‌డ వ‌చ్చింద‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. వీటిని దాటుకుని రాజ‌కీయంగా మ‌ళ్లీ ఇక్క‌డ నిల‌దొక్కుకునేందుకు అప్ప‌ల‌రాజు పొలిటిక‌ల్ తిప్ప‌లు మామూలుగా లేవు.


9490520108.. ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌స్య‌లు, ఎమ్మెల్యేల ప‌నితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్ర‌జ‌ల ఇబ్బందులు, అక్క‌డ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ప‌రిస్థితులు, రాజ‌కీయ అంశాల‌పై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: