రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. ఏం జరిగిందంటే?
తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన తీపికబురు అందించింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల విషయంలో ఇప్పటివరకు ఉన్న భారమైన నిబంధనలను సడలిస్తూ రైతులకు భారీ ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైతులు తమ పొలాలకు విద్యుత్ కనెక్షన్ పొందాలనుకుంటే కిలోవాట్‌కు కేవలం 1000 రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. తమకు అవసరమైన సామర్థ్యాన్ని బట్టి ఈ నామమాత్రపు ఛార్జీలు కడితే కొత్త కనెక్షన్ లభించనుంది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ట్రాన్స్ఫార్మర్ నుండి మూడు విద్యుత్ స్తంభాల దూరం దాటితే రైతులు 'ఔట్ రైట్ కంట్రిబ్యూషన్' (ఓఆర్సీ) కింద భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి వచ్చేది. సుమారు 45 వేల రూపాయలకు పైగా విద్యుత్ శాఖకు చెల్లించాల్సి రావడంతో సామాన్య రైతులకు ఇది పెను భారంగా మారేది. అనేకమంది రైతులు ఆర్థిక స్తోమత లేక కనెక్షన్ల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది.
అయితే తాజా ఉత్తర్వులతో ఈ ఓఆర్సీ నిబంధనను తొలగించడమే కాకుండా, కనెక్షన్ ప్రక్రియను మరింత సరళతరం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది రైతులకు ఆర్థిక వెసులుబాటు కలగడమే కాకుండా, సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే క్రమంలో విద్యుత్ కనెక్షన్ల భారాన్ని తగ్గించడం రాష్ట్ర రైతాంగానికి పెద్ద ఊరటగా మారింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.