ఏపీలో ఎమ్మెల్యేలు వ‌ర్సెస్ ప్ర‌భుత్వం.. !

RAMAKRISHNA S.S.
కూట‌మి ప్ర‌భుత్వంలో ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం, స‌ర్కారు తీరుతో పొంత‌న లేకుండా పోవ‌డం ప్ర‌స్తుతం రాష్ట్ర రాజ‌కీయాల్లో పెద్ద చ‌ర్చ‌గా మారింది. ముఖ్యంగా కొంద‌రు ఎమ్మెల్యేలు ప్ర‌భుత్వానికి భిన్నంగా ప్ర‌వ‌ర్తిస్తూ, స్వ‌తంత్ర నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, కర్ర పెత్త‌నం ప్ర‌ద‌ర్శించ‌డం, విమ‌ర్శ‌ల్లో చిక్కుకోవ‌డం వంటివి కూట‌మి స‌ర్కారును ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాయి. అనుకూల మీడియా వర్గాలు కూడా ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ, “ఎమ్మెల్యేల దూకుడు వ‌ర్సెస్ ప్ర‌భుత్వం” అనే వార్‌ను హైలెట్ చేస్తున్నాయి. దాదాపు 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ ధోరణి మ‌రింత స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కొంద‌రు ఎమ్మెల్యేలు కఠిన వైఖ‌రి చూపుతూ ప్ర‌జ‌లలో విమర్శలు ఎదుర్కొంటుంటే, ఇంకొంద‌రు మాత్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌ప్పులు చేయ‌ని ఎమ్మెల్యేలను కూడా అనుమానించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది.


ఇదే స‌మ‌యంలో, సీఎం చంద్ర‌బాబు తీరుపై కూడా వ‌ర్గాల‌వారీగా చ‌ర్చ జ‌రుగుతోంది. కొంద‌రు ఎమ్మెల్యేల త‌ప్పుల‌పై ఆయ‌న కేవ‌లం హెచ్చరికలు, వార్నింగులు ఇస్తూ వ‌దిలేస్తున్నా.. కఠిన చ‌ర్యలు తీసుకోవ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. పార్టీ మెజారిటీ బ‌లంంగా ఉన్న ఈ ద‌శ‌లో, కొంతమంది ఎమ్మెల్యేల‌పై కఠినంగా వ్య‌వ‌హ‌రించినా ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది రాద‌ని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 134 మంది ఎమ్మెల్యేల్లో ఓ పది, పదిహేను మంది తప్పుదోవ పట్టినా, వారిని సస్పెండ్ చేయడం, గట్టిగా మందలించడం లేదా పార్టీ నుండి బయటకు పంపడం వల్ల‌ మిగతా నాయకులు అలెర్ట్ అవుతారని వారు సూచిస్తున్నారు.


ఇలా చేస్తే మిగిలిన ఎమ్మెల్యేలందరికీ స్పష్టమైన సందేశం వెళ్తుందని, ప్ర‌భుత్వం విశ్వసనీయత కూడా పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కానీ చంద్ర‌బాబు ఈ మార్గాన్ని ఎంచుకుంటారా, లేకపోతే ఇప్ప‌టివ‌రకు లాగే వార్నింగులకే పరిమితం అవుతారా అనేది చూడాలి. ఒకవేళ కఠిన చర్యలు తీసుకోకపోతే, “ఎమ్మెల్యేల దూకుడు – స‌ర్కారు ఉదాసీన‌త” అనే ఈ వ్యత్యాసం కూట‌మి ప్ర‌భుత్వానికి భ‌విష్య‌త్తులో స‌వాళ్లుగా మార‌తుంద‌నే అంచనాలు వెలువ‌డుతున్నాయి. మొత్తానికి, ప్రస్తుతం కూట‌మి ప్ర‌భుత్వం లోప‌ల అప్ర‌క‌టిత రాజ‌కీయ యుద్ధం నడుస్తోందన్నది వాస్తవంగా అనిపిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు చంద్ర‌బాబు గట్టి నిర్ణయాలు తీసుకుంటారా లేదా అనేదే కీలకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: