చంద్ర‌బాబు రాజ‌కీయాలు... భువ‌న‌మ్మ త్యాగం.. లోకేష్ చెప్పిన మాట ఇదే..!

RAMAKRISHNA S.S.
రాష్ట్రంలో మహిళల గౌరవం పెరిగేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, పిల్లలను చదివించేందుకు ఏ తల్లీ ఇబ్బంది పడకూడదనే తల్లికి వందనం పథకం అమలుచేశామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు, కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఉదయం మచిలీపట్నం చేరుకున్న మంత్రి లోకేష్ కు మూడుస్థంబాల సెంటర్ లో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో తల్లికి వందనం లబ్ధిదారులైన మహిళలు ఘనస్వాగతం పలికారు. తల్లికి వందనం పథకం అమలుచేసినందుకు మహిళలు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు తెలుగు మహిళలు హారతితో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ.. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ రుణపడి ఉంటాను. గతంలో మహిళలను కించపరిచేలా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలను, తల్లులను గౌరవించాలని నిర్ణయించాం. సమాజంలో కూడా మార్పు రావాలి. మహిళలతో మాట్లాడే విధానం మారాలి. చట్టాలతో, డబ్బులతో ఆ మార్పు రాదు. గాజులు తొడుక్కో, ఆడపిల్లలా ఏడుస్తున్నావు వంటి వ్యాఖ్యలను మానుకోవాలి. పాఠశాలల్లో మహిళలను గౌరవించేలా విద్యార్థులకు పాఠ్యాంశాలు రూపొందించడం జరిగింది. అన్ని పనులు ఇద్దరూ సమానంగా చేయాలి.


మా అమ్మగారి త్యాగం వల్లే చంద్రబాబు గారు రాజకీయాలు చేస్తున్నారు

నాకు, బ్రాహ్మణికి చిన్న వయసులోనే పెళ్లి చేశారు. మేం సమానంగా ఇంటిపనులు చేసేవాళ్లం. నేను పాదయాత్ర చేసి అహర్నిశలు ప్రజల కోసం కష్టపడుతున్నానంటే అందుకు బ్రాహ్మణి సహకారమే కారణం. బ్రాహ్మణి సహకారం లేకపోతే నేను ఏం చేయలేను. మా అమ్మగారి త్యాగం వల్లే చంద్రబాబుగారు రాజకీయం చేస్తున్నారు. మా అమ్మగారు త్యాగం చేయకపోతే బాబుగారు రాష్ట్రానికి సేవ చేయలేరు. మహిళల త్యాగాలతోనే మేం ఈ స్థాయిలో ఉన్నాం. రెడ్ బుక్ పేరు వింటేనే గుండెపోటు వస్తోంది. మహిళలకు గౌరవం పెరిగేలా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.


మచిలీపట్నం పర్యటనలో మంత్రి లోకేష్ కు అడుగడుగునా స్వాగతం

పార్టీ కార్యక్రమాలు, కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రోడ్డుమార్గం ద్వారా మచిలీపట్నం బయలుదేరిన విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఘనస్వాగతం పలికారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మొవ్వ మండలం నిడుమోలు వద్ద మంత్రి లోకేష్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజానీకం ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: