
10 ఏళ్ళ గులాబి విధ్వంసం లెక్కలు ఇవే..? కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతోంది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వన్య ప్రాణులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయని సోషల్ మీడియాలో పలు వీడియోలు షేర్ చేస్తూ విమర్శిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటుగా పలు సందర్భాల్లో లక్షలాది చెట్లను బీఆర్ఎస్ పార్టీ హయాంలో నరికేశారు అంటూ లెక్కలు బయటకు తీస్తోంది.
2014 నుంచి 2023 వరకు పెద్ద ఎత్తున అడవులను నాశనం చేసారని విమర్శిస్తోంది. హరిత హారం కార్యక్రమాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడవులను పెంచే లక్ష్యంతో పని చేసింది. ఇందుకోసం పది వేల కోట్ల రూపాయలను అప్పట్లో ఖర్చు చేసారు. 2015 నుండి 2022 వరకు అప్పటి ప్రభుత్వం 219 కోట్ల మొక్కలు నాటగా ఇందుకోసం 9,777 కోట్లు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రెండు శాఖల నుంచి భారీగా నిధులు కేటాయించారు.
గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 5,006.82 కోట్లు కేటాయించగా.. అటవీ శాఖ నుంచి 2,567.12 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఇక నాటిన మొక్కలలో 85 శాతం బతికినట్టు అప్పట్లో కెసిఆర్ వెల్లడించారు. అదే నిజమైతే తెలంగాణ అటవీ విస్తీర్ణం 21,591 చ.కి.మీ 2014కు ఉండగా.. అక్కడి నుంచి 2021 నాటికి 21,213 చ.కి.మీకి ఎందుకు తగ్గిపోయింది అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. 2014 నుంచి 2024 మధ్య, బీఆర్ఎస్ పాలనలో 11,422.47 హెక్టార్ల అటవీ భూమిని అధికారికంగా.. అటవీయేతర ప్రయోజనాల కేటాయించింది కెసిఆర్ సర్కార్.
ఇక అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి 2016 నుంచి 2019 మధ్య కాలంలోనే 12,12,753 చెట్లను కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నరికినట్టు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఆ ప్రాజెక్ట్ కారణంగా ఏ ఉపయోగాలు లేకపోయినా.. ఇందుకోసం 8,000 ఎకరాల్లో అడవిని నరికినట్టు చెప్తోంది. మరి అప్పుడు పర్యావరణ ప్రేమికులు ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక 2014 నుంచి 2023 మధ్య కాలంలో 4,28,437 ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం విక్రయించగా ఇందులో ఎక్కువగా అటవీ భూములే ఉన్నాయనేది కాంగ్రెస్ ఆరోపణ. మరి అప్పుడు లేని పర్యావరణ ప్రేమ ఇప్పుడు ఎందుకు అంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.