
కేసీఆర్ ను ఖతం చేసేందుకు కేటీఆర్, హరీశ్ రావు కుట్ర పన్నారా?
14 గ్రామాల ప్రజలను పోలీసులతో కొట్టించి బలవంతంగా భూసేకరణ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల వద్ద ఎవరికి భూములు, ఫామ్‌హౌజ్‌లు ఉన్నాయో నిజనిర్ధారణ కమిటీ వేద్దామా అని సవాల్ విసిరారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్ చుట్టూ కాలువలు తీసినట్లు నిరూపిస్తానని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల కోసం పేదల భూములు తీసుకుని కేసీఆర్, వాళ్ల బంధువుల భూములను తప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను భూసేకరణను వ్యతిరేకించలేదని, పరిహారం పెంచాలని మాత్రమే ధర్నాలు చేశానని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
కమీషన్ల కోసం ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ.36 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టారని విమర్శించారు. కమీషన్ల కోసం రూ.లక్ష కోట్ల నిధులతో కాళేశ్వరం చేపట్టారని దుయ్యబట్టారు. కాళేశ్వరం అవినీతి విషయంలో త్వరలోనే వీళ్లు జైలుకు వెళ్తారని హెచ్చరించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఏకసభ్య కమిషన్ చెప్పిందని గుర్తు చేశారు. మూసీని పునరుద్ధరించాలా వద్దా అని విపక్షాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మెట్రోరైలు విస్తరించాలా వద్దా అని నిలదీశారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు రేడియల్ రోడ్లు నిర్మించాలా వద్దా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రభుత్వ స్కూల్‌లో చదివిన వ్యక్తి సీఎం అయితే వాళ్లు ఓర్వలేక పోతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు ఎక్కువ వచ్చినంత మాత్రాన గొప్ప కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలతో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.