ట్రంప్ సంచలన నిర్ణయం.. వారికోసం ప్రత్యేకమైన యాప్?

frame ట్రంప్ సంచలన నిర్ణయం.. వారికోసం ప్రత్యేకమైన యాప్?

praveen
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త యాప్‌ను లాంచ్ చేశారు. దాని పేరు 'CBP హోమ్'. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వాళ్లు స్వయంగా దేశం విడిచి వెళ్లిపోయేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇష్టపూర్వకంగా వెళ్లని వారిని బలవంతంగా పంపిస్తామని, అంతేకాదు, శాశ్వతంగా అమెరికాలోకి రాకుండా బ్యాన్ చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఈ యాప్ ద్వారా సొంతంగా వెళ్లిపోయే వాళ్లకి భవిష్యత్తులో చట్టబద్ధంగా తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని ట్రంప్ చెప్పారు. కానీ, ఎవరైతే వెళ్ళడానికి ఒప్పుకోరో వాళ్ళని మాత్రం కనిపెట్టి దేశం నుంచి గెంటివేస్తామని, మళ్లీ ఎప్పటికీ అమెరికా గడ్డపై కాలు పెట్టనివ్వమని తేల్చి చెప్పారు.
ఇంతకుముందు బైడెన్ ప్రభుత్వం 'CBP వన్' యాప్‌ను దుర్వినియోగం చేసిందని ట్రంప్ విమర్శించారు. ఆ యాప్ ద్వారానే 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారుల్ని అమెరికాలోకి అనుమతించారని ఆరోపించారు. అయితే, 'CBP హోమ్' యాప్ మాత్రం అక్రమంగా ఉంటున్నవాళ్ళు సులువుగా, భద్రంగా స్వదేశాలకు వెళ్ళిపోయేందుకు ఉపయోగపడుతుందని ట్రంప్ అన్నారు.
ఈ సెల్ఫ్-డెపోర్టేషన్ యాప్ వల్ల ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP), ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) సంస్థలపై భారం తగ్గుతుందని అన్నారు. దీంతో ప్రమాదకరమైన నేరస్తుల్ని దేశం నుంచి పంపించేందుకు మరింత ఫోకస్ పెట్టొచ్చని ట్రంప్ వెల్లడించారు.
'CBP హోమ్' యాప్ అన్ని ప్రముఖ యాప్ స్టోర్లలో ఉచితంగా అందుబాటులో ఉందని ట్రంప్ తెలిపారు. అక్రమ వలసదారులు వెంటనే దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అలా చేయని వాళ్ళని శాశ్వతంగా అమెరికా నుంచి బహిష్కరిస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
"సరైన మార్గంలో వెళ్తే మళ్లీ ఎప్పటికైనా చట్టబద్ధంగా తిరిగి రావచ్చు. కానీ నిరాకరిస్తే మాత్రం మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తారు. మళ్లీ వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు" అని ట్రంప్ కుండబద్దలు కొట్టారు.
ఇటీవల తన ప్రభుత్వం భారీ సంఖ్యలో డెపోర్టేషన్లు చేసిన తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం. అయితే, డెపోర్ట్ చేసిన వ్యక్తుల వివరాలు, వాళ్ళపై ఉన్న ఆధారాలను ప్రభుత్వం బయటపెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని, ఇది పౌర హక్కులకు ప్రమాదకరమని వలస కుటుంబాలు, మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని సీఎన్ఎన్‌ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: