ఈ రోజు కూడా స‌క్సెస్ కాక‌పోతే.. జ‌గ‌న్‌కు షాకే.. !

Amruth kumar
వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్నారు. 11 మంది ఎమ్మెల్యేల‌తో ఉన్న ఆయ‌న‌.. ప్ర‌జా ఉద్య మాల దిశ‌గా అడుగులు వేసిన విష‌యం తెలిసిందే. ఈ నెలలో  రెండు కీల‌క నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు వైసీ పీ అధినేత రంగం రెడీ చేశారు. దీనిలో ఒక‌టి రైతుల‌కు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన విష‌యం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21న నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీనికి సంబంధించి వారం ముందుగానే స‌న్నాహాలు చేప‌ట్టారు. అంద‌రూ పాల్గొనాల‌ని.. జ‌గ‌నే స్వ‌యంగా పిలుపునిచ్చారు.

ఇక‌, జిల్లాల ఇంచార్జ్‌లు ఆయా జిల్లాల్లో నాయ‌కుల‌ను క‌లిసి.. నిర‌స‌న‌ల‌కు క‌లిసి రావాల‌ని కూడా పిలుపు నిచ్చారు. కానీ, అనుకున్న విధంగా తొలిసారి ధ‌ర్నా, నిర‌స‌న‌లు క‌లిసి రాలేదు. నాయ‌కులు ఎవ‌రూ పెద్ద‌గా స్పందించ‌లేదు. ఏదో తూతూ మంత్రం అన్న‌ట్టుగా మొక్కుబ‌డి ధ‌ర్నాల‌తో స‌రిపుచ్చారు. ఇక‌, వైసీపీ నుంచి పెద్ద యాగీ ఉండ‌ద‌ని ముందుగానే గుర్తించిన ప్ర‌భుత్వం వారిని ఎక్క‌డా నిర్బంధించి.. అరెస్టు చేసే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్ట‌లేదు.

దీంతో నిర‌స‌న‌లు స‌జావుగానే సాగినా.. పెద్ద‌గా మైలేజీ అయితే ల‌భించ‌లేదు. ఇక‌, ఇప్పుడు ఈనెల 27 (శుక్ర‌వారం)న విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుపై నిర‌స‌న వ్య‌క్తం చేయాల‌ని జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ఆయ‌న ఎక్క‌డా పాల్గొన‌రు. కానీ, పార్టీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు మాత్రం ఆయ‌న పిలుపునిచ్చారు. గ‌తంలో రైతు నిర‌స‌న కార్య‌క్ర‌మం ప్రారంభించిన రోజే.. బెంగ‌ళూరుకు వెళ్లిపోయారు. దీంతో అది మొక్కుబ‌డిగానే సాగింది. దీంతో ఈ ద‌ఫా మీరు రంగంలోకి దిగాల‌ని.. మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇప్ప‌టికే చెప్పారు.

అంటే.. శుక్ర‌వారం  త‌ల‌పెట్టిన విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుపై నిర‌స‌న‌ల్లో జ‌గ‌న్‌ను పాల్గొనాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.కానీ, జ‌గ‌న్ హాజ‌రు కావ‌డం లేదు. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. మాత్ర‌మే పాల్గొనా ల‌ని విద్యార్థుల త‌ర‌ఫున పోరాటం చేయాల‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. ఇప్పుడు కూడా.. ఈ కార్య‌క్ర‌మం స‌క్సెస్ అవుతుందా? అంటే సందేహ‌మే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డా కూడా.. ఆ త‌ర‌హా ప‌రిస్థితి వైసీపీ నేత‌ల్లో క‌నిపించ‌డం లేదు. ప్ర‌భుత్వం కూడా లైట్ తీసుకుంది. దీనిని బ‌ట్టి ఈ కార్య‌క్ర‌మం స‌క్సెస్ కాక‌పోతే.. ఇక‌, వైసీపీ నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేసుకోవ‌డ‌మే మంచిద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: