ఆ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిన రేవంత్ రెడ్డి..?

Chakravarthi Kalyan

తెలంగాణ ప్రభుత్వం కొత్త సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లపై కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  తాను సీఎం పదవిలో ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వనని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.  ఇదే విషయాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం తేల్చిచెప్పారు. ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకూ తెలుగు సినీ పరిశ్రమకు ఫేవర్ గా ఉంటూ వచ్చాయి. టికెట్ ధరల పెంపుపై సానుకూలంగా స్పందిస్తూ వస్తోంది. 'పుష్ప 2' ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన, తదనంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షోలు, స్పెషల్ టికెట్ రేట్లు ఉండవని ప్రకటించింది. ఇది పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


'టికెట్ రేట్ల పెంపుపై ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సామాన్యుల నుంచి మద్దతు లభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా సినిమా టికెట్ ధరలు ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో రేట్లు పెంచుకోడానికి అనుమతిస్తే అది ప్రభుత్వంపై విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్తారో అనే చర్చలు జరుగుతున్నాయి.


సంక్రాంతికి టాలీవుడ్ లో పలు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు పెద్ద పండక్కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.  వీటికి తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకపోతే ఓపెనింగ్ కలెక్షన్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది.


''ప్రభుత్వం వైపు నుంచి ఇండస్ట్రీకి ఫుల్ సపోర్ట్ ఉంటుందని అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ మీటింగ్ లోనే పవన్ కల్యాణ్ చెప్పారు. అప్పటి నుంచి రిలీజైన సినిమాలన్నిటికీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ ఎప్పుడూ అలానే ఉంటుందని ఆశిస్తున్నాం'' అని తాజాగా 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగవంశీ అన్నారు.  మరి టికెట్ హైక్స్, బెనిఫిట్ షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తర్వాత, ఏపీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: