కెంజుట్సు పవన్ కల్యాణ్ - 5వ డాన్‌గా అరుదైన గౌరవం ... !
జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థగా పేరుగాంచిన సోగో బుడో కన్‌రి కై, పవన్ కళ్యాణ్ నిబద్ధతను మెచ్చుకుంటూ ఆయనకు ‘ఫిఫ్త్ డాన్’ (5th Dan) పురస్కారాన్ని అందజేసింది. అంతేకాకుండా, జపాన్ దేశం బయట ప్రతిష్టాత్మకమైన 'టకెడా షింగెన్ క్లాన్' లో సభ్యత్వం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన చారిత్రాత్మక రికార్డు నెలకొల్పారు. దీనితో పాటు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ సంస్థ గోల్డెన్ డ్రాగన్స్, పవన్ కళ్యాణ్‌ను ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ అనే బిరుదుతో సత్కరించింది. నిరంతరం ప్రజా సేవలో ఉంటూ కూడా తనకిష్టమైన యుద్ధకళా సాధనను వదలకపోవడం ఆయనలోని పట్టుదలకు నిదర్శనం.
పవన్ కళ్యాణ్ సినీ రంగ ప్రవేశానికి ముందే చెన్నైలో కరాటే మరియు ఇతర మార్షల్ ఆర్ట్స్‌లో కఠినమైన శిక్షణ పొందారు. ఆయన కేవలం శారీరక వ్యాయామంగా మాత్రమే కాకుండా, జపనీస్ సమురాయ్ సంప్రదాయాలు మరియు యుద్ధ తత్వశాస్త్రంపై లోతైన అధ్యయనం చేశారు. ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ మార్గదర్శకత్వంలో కెంజుట్సులో ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యాన్ని సాధించారు. తన సినిమాలైన తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ ద్వారా ఈ జపనీస్ యుద్ధకళలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వాటికి విస్తృత ప్రచారం కల్పించారు.
నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ వేదికపై భారతీయ ప్రతిభను చాటారు. కెంజుట్సులో ఆయనకు లభించిన ఈ గౌరవం ఆయన జీవితకాల సాధనకు దక్కిన అద్భుత ప్రతిఫలం. సినిమా గ్లామర్, రాజకీయ బాధ్యతలు మరియు యుద్ధ తత్వశాస్త్రాన్ని సమన్వయం చేస్తూ ఆయన సాగిస్తున్న ప్రయాణం ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ పురస్కారాలు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయి.