అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. ఓటర్లను ప్రభావితం చేసిన 5 అంశాలు ఇవే?

praveen
ఒక్క అమెరికా మాత్రమే కాకుండా, యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం కీలక ఘట్టానికి చేరుకున్నట్టు సమాచారం. మరికొద్ది గంటల్లో జయాపజయాలు ఎవరివో తేలిపోనున్నాయి. ఎన్నికల బరి నుంచి జో బైడెన్‌ వైదొలగడంతో డెమొక్రాట్ అభ్యర్థిగా తెరపైకి వచ్చిన భారత సంతతి మహిళ కమలా హ్యరిస్‌ అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలని కలలు కంటుంటే, మరోసారి తనకు అవకాశం ఇస్తే దేశాన్ని గొప్పగా తీర్చుదిద్దుతాను అని రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ క్రమంలో ఎవరికి అమెరికా ప్రజలు ఎవరికీ పట్టం కడతారు? అనే విషయం మరి కొద్ది క్షణాల్లో తేలిపోనుంది.
ఇక డెమొక్రాటిక్ అభ్యర్ధిగా కమలా పేరును ప్రకటించినప్పుడు ఆమెకు అనూహ్యంగా మద్దతు ఎక్కువ లభించడం గమనార్హం. అన్ని సర్వేల్లోనూ ట్రంప్ కంటే ఆమే ముందంజలో ఉన్నారు. కానీ, పోలింగ్ సమయం దగ్గరపడ్డ కొద్దీ కమలా గ్రాఫ్ తగ్గడం.. ట్రంప్ గ్రాఫ్ పెరగడం కొసమెరుపు. కాగా ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో అక్రమ వలసలు, ఆర్థిక వ్యవస్థను ట్రంప్‌ అస్త్రాలుగా చేసుకుంటే.. అబార్షన్ హక్కు, రాజ్యాంగ పరిరక్షణ వంటి నినాదాలను హ్యారిస్ ఎత్తుకోవడం విశేషం. ఓటర్ల విషయంలో ఆర్థిక వ్యవస్థ ప్రధాన సమస్యగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. చాలామంది అమెరికన్లు అధిక ధరలతో సతమతమవుతున్నారని, నాలుగింట ఒకవంతు మాత్రమే దేశ ప్రస్తుత పరిస్థితులతో సంతృప్తిగా ఉన్నారని పేర్కొంది. ఈ అంశమే ట్రంప్‌కు సానుకూలంగా మారితే విజయం తధ్యం.
అయితే, ఎన్నికల్లో భావోద్వేగ అంశాలు కూడా కీలకమే. అబార్షన్ల అంశంపై డెమొక్రట్లు ఆశలు పెట్టుకోగా.. అక్రమ వలసలపై ట్రంప్‌ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బైడెన్‌ హయాంలో అక్రమ వలసలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపథ్యంలో.. ఈ విషయంలో ఓటర్లు ట్రంప్‌నే ఎక్కువగా విశ్వసిస్తున్నట్లు పోల్స్ సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్న అంశాలు ప్రధానముగా 5 కనబడుతున్నాయి. ఇదే విషయాలను ‘ఎడిసన్ రీసెర్చ్’ తొలి ఎర్లీ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించడం గమనార్హం. 35% మందిని ‘ప్రజాస్వామ్యం’, 31% మంది ‘ఎకానమీ’, 14% మంది ‘అబార్షన్’ అంశం, 11% మంది ‘వలస విధానం’, 4% మందిని ‘విదేశీ పాలసీ’ ప్రభావితం చేశాయి. ప్రజాస్వామ్యం, అబార్షన్ అంశాలు కమలకు, ఎకానమీ, వలస విధానం ట్రంప్‌నకు కలిసొస్తున్నట్లు సర్వేలో చాలా స్పష్టంగా తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: