వింత ఆచారం.. దీపావళి ముగింపు వేడుకలు ఎలా జరుపుకున్నారో చూడండి?
తమిళనాడు రాష్ట్రం, ఈరోడ్ జిల్లా, తలవడి అనే చిన్న గ్రామంలో, దీపావళి పండుగ తర్వాత ఓ ప్రత్యేకమైన సంప్రదాయాన్ని ప్రజలు ఆచరిస్తూ మిగతా భారతదేశాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ సంప్రదాయం దాదాపు 300 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ప్రతి ఏటా, అనేక తరాల ప్రజలు ఈ ప్రత్యేకమైన వేడుకలో పాల్గొంటారు. దీపావళికి ముగింపు పలకడానికి వీళ్ళు ఒకరిపై ఒకరు ఆవు పేడను విసురుకుంటారు. ఈ ఉత్సవం బీరేశ్వరర్ ఆలయానికి సంబంధించినది. ఇది దీపావళి తర్వాత నాల్గవ రోజు జరుగుతుంది. ఈ దీపావళి ముగింపు వేడుకలను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్య పోవాల్సిందే.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా తలవడి గ్రామంలో జరిగే ఈ విచిత్రమైన ఉత్సవంలో, ప్రతి సంవత్సరం ఆదివారం ఉదయం గ్రామస్థులు గ్రామం మొత్తం నుంచి ఆవు పేడను సేకరించి ఒక పెద్ద గుంటను నింపుతారు. ఆ తర్వాత ఆలయ తీర్థకుండంలో దేవునికి ప్రత్యేక పూజలు చేసి, ఆ గుంటలోకి దూకి ఒకరిపై ఒకరు ఆవు పేడను విసురుకుంటారు.
ఈ ఉత్సవం వెనుక ఒక ప్రత్యేక నమ్మకం ఉంది. ఈ గుంటలో శివలింగం కనిపించిందని, అది చాలా కాలంగా సహజ ఎరువుగా ఉపయోగించబడుతుందని ప్రజలు నమ్ముతారు. ఆ శివలింగాన్ని ఇప్పుడు బీరేశ్వరర్ ఆలయంలో ఉంచారు. ఆవు పేడ విసురుకున్న తర్వాత, గ్రామస్థులు ఆ పేడను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఆ పేడను వాళ్ళ పంటలకు ఎరువుగా వాడుతారు. ఈ ఏడాది మంచి పంట పండటానికి ఇది సహాయపడుతుందని వాళ్ల నమ్మకం. కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో ఉన్న గుమటాపుర అనే గ్రామంలో కూడా దీపావళి ముగింపును ఇలాంటి ఆవు పేడ విసురుకునే వేడుకతో జరుపుకుంటారు.
ఈ వేడుకను "గోరెహబ్బ" అని అంటారు. ఈ వేడుక కర్ణాటకలో కూడా వంద సంవత్సరాలకు పైగా జరుగుతుందని చెబుతారు. ఏది ఏమైనా భారతదేశవ్యాప్తంగా ప్రజలు పాటించే ఎన్నో సంప్రదాయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. వింతగా అనిపించినా వీటిని ఇప్పటికే పాటిస్తూ ప్రజలు తమ పాతకాలం నాటి సాంప్రదాయాలకు వాల్యూ ఇస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు.