నకిలీ కోర్టుని సృష్టించి 5 ఏళ్లు భారీగా దందా... కట్ చేస్తే చివరికి!

praveen
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా నకిలీవే కనిపిస్తున్నాయి. కాస్త ఓపెన్ గా మాట్లాడుకోవాలి అంటే, ప్రపంచమే నకిలీగా మారిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక మనుషుల సంగతి సరేసరి. జంతర్ మంతర్ జాదూగాళ్ళు ఇక్కడ ఎక్కువైపోయారు. డబ్బు సంపాదించడానికి ఈజీ మార్గాలని ఎంచుకుంటున్నారు. దానికోసం దారుణమైన మోసాలకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఏకంగా నకిలీ కోర్టునే ఏర్పాటు చేసేసాడు. అంతటితో ఆగకుండా తానే జడ్జి అంటూ అందర్నీ నమ్మించాడు. కట్ చేస్తే, ఆ వ్యాపారాన్ని గత 5 ఏళ్లుగా కొనసాగిస్తున్నాడు. కొందరికి అనుకూలంగా తీర్పులు ఇస్తూ.. భారీగా వసూళ్లు రాబడుతూ దండిగా సంపాదించాడు. అయితే పాపం పండే రోజు రానే వచ్చింది.
ఈ క్రమంలోనే ఓ కేసు విషయంలో ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఉత్తర్వులు జారీ చేసి, అతి చేయబోయాడు. దాంతో తాను తీసిన గోతిలో తానే స్వయంగా పడ్డాడు. ఆ ఉత్తర్వులను క్షుణ్ణంగా పరిశీలించడంతో.. అవి కాస్తా నకిలీ ఉత్తర్వులు అని తేలగా గుట్టు రట్టయింది. తీగ లాగితే మొత్తం డొంకంతా కదిలింది. నకిలీ కోర్టుతోపాటు నకిలీ జడ్జి గురించి తెలుసుకున్న పోలీసులు, షాక్ అయ్యారు. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ అనే వ్యక్తి.. ఓ నకిలీ కోర్టును ఏర్పాటు చేసి, తానే జడ్జి అని అందర్నీ నమ్మించాడు. ఈ క్రమంలోనే ఓరోజు అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలకు సంబంధించిన కేసులను సేకరించి.. వారిని మెల్లగా బుట్టలోకి దింపాడు. అదేవిధంగా ఓ నకిలీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి.. దాని ముందుకు కోర్టులో పెండింగ్ కేసులతో సతమతం అవుతున్న వారిని పిలిచి, నకిలీ విచారణ చేపట్టి.. అందులో కొందరికి అనుకూలంగా తీర్పులు ఇచ్చేశాడు. ప్రతిఫలంగా వారి నుంచి భారీగా డబ్బులు దండుకున్నాడు. అయితే 2019లో ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసులో.. తాజాగా ఓ వ్యక్తికి అనుకూలంగా తీర్పునివ్వాల్సి ఉంది. దానికోసం ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఉత్తర్వులు జారీ చేశాడు. అయితే ఆ ఉత్తర్వులు నకిలీవి అని కోర్టు రిజిస్ట్రార్ గుర్తించి, రంగంలోకి దిగగా మోరిస్ శామ్యూల్‌ క్రిస్టియన్ బండారం మొత్తం బయటికి వచ్చింది. దాంతో ఈ జాదూగాడు ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: