ఇలాంటి చికెన్ తింటే బతుకుతామా.. అందరిలో భయం భయం?
తాజాగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు… టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు రోహిత్ రెడ్డి, పి.స్వాతితో కూడిన బృందం నిజామాబాద్ నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ హైస్‌లు, పసుపు, కారం తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించగా విస్తుపోయే విషయాలు వెలువడ్డాయి. నిజామాబాద్ నగరంలోని దినేశ్వర్ బైపాస్ రోడ్‌లోని లహరి ఇంటర్నేషనల్ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ ప్రత్యేక బృందం దాడులు చేయగా దారుణాలు వెలుగుచూశాయి. ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం... రిఫ్రిజిరేటర్‌లో సరైన ఉష్ణోగ్రతను నిర్వహించడం లేదని, నాన్-ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కవర్లలో కుళ్ళిన మాంసం ఉత్పత్తులను నిల్వ చేయడంపై అధికారులు మండిపడ్డారు.
అది మాత్రమే కాకుండా విషపూరితమైన ఫుడ్ కలర్స్ కలిపిన చికెన్, బూజుపట్టిన మసాలా, కుళ్ళిన కూర గాయలు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు హోటల్ యాజమాన్యంపై విరుచుకు పడ్డారు. ఈ క్రమంలో హోటల్ కు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఢిల్లీ వాలా స్వీట్ హౌస్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అక్కడి అపరిశుభ్రతను చూసి అధికారులు షాక్ తిన్నారు. ఈ క్రమంలో స్వీట్ హౌస్ నిర్వహణపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ హెడ్ వి.జ్యోతిర్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రజలను ఉద్దేశించి ముఖ్యమైన సూచనలు చేసారు... అత్యవసరం అయితే తప్పితే బయట ఆహారం తినవద్దని, చికెన్, మటన్ వంటి ఆహారాన్ని అస్సలకే తినవద్దని హెచ్చరించారు.