సీనియ‌ర్ ఎమ్మెల్యే దోపిడి : పంచాయ‌తీ ఉద్యోగి బ‌దిలీకి కూడా రు. 50 వేలు క‌ప్పం..!

RAMAKRISHNA S.S.
- అవినీతికి తెర‌లేపిన‌ గోదావ‌రి జిల్లా సీనియ‌ర్ ఎమ్మెల్యే..?
- ఉద్యోగులు బ‌దిలీలు.. ఇసుక దోపిడీలో భారీగా చేతివాటం
- ఇదే త‌న‌కు చివ‌రి ఛాన్స్ అంటూ వెన‌కేసుకుంటోన్న వైనం

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 100 రోజులు అవుతుందో లేదో కాని అప్పుడే కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు చిల‌క‌కొట్టుడు కొడితే అన్న‌ట్టుగా వ‌సూళ్ల‌కు తెర‌లేపేస్తున్నారు. చంద్ర‌బాబు - ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైసీపీ ప్ర‌భుత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంద‌రూ తీవ్ర‌మైన అవినీతికి పాల్ప‌డ్డార‌ని.. త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే అవినీతి అనేదే లేకుండా పాల‌న చేస్తామ‌ని చెప్పారు. కానీ అవ‌న్నీ గాలిలో మాట‌లు.. నీటిమీద రాత‌లు అన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఒక్కో ఎమ్మెల్యే అవినీతి.. చందాలు.. మామూళ్లు.. లంచాల‌కు తెర‌లేపుతున్నారు.

ఈ క్ర‌మంలోనే గోదావ‌రి జిల్లాల్లో పార్టీ సీనియ‌ర్ ఎమ్మెల్యే ఒక‌రు కూడా దారుణంగా అవినీతికి పాల్ప‌డుతున్న‌ట్టు నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న సీనియ‌ర్‌.. ఈ ఎన్నిక‌ల్లో సీటు వ‌స్తుందా ?  రాదా ? అన్న సందేహాల మ‌ధ్య ఇవే చివ‌రి ఎన్నిక‌లు అంటూ ఏదోలా సీటు తెచ్చుకుని పార్టీ గాలిలో మంచి మెజార్టీతోనే విజ‌యం సాధించారు. మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నా అవి నెర‌వేర‌లేదు. దీంతో వ‌సూళ్ల ప‌ర్వానికి తెర‌దీసిన‌ట్టుగా టాక్ ?

ఇప్పుడు ఈ విష‌యం నియోజ‌క‌వ‌ర్గం అంతా గ‌ట్టిగా పాకేస్తోంది. ఇసుక దోపిడితో మొద‌లు పెట్టి.. చివ‌ర‌కు చిన్న చిన్న ఉద్యోగుల బదిలీల‌కు కూడా వ‌సూళ్ల‌కు బోర్డ్ పెట్టేశాడ‌ని అంటున్నారు. ఓ పంచాయ‌తీలో చిన్న ఉద్యోగి బ‌దిలీ కావాలంటే మినిమం రేటు రు. 50 వేలు ఫిక్స్ చేశార‌ట‌. ఇక గోదావ‌రి తీరం కావ‌డంతో ఇటు ఇసుక దోపిడీ.. ఇసుక కోసం వ‌సూళ్లు కూడా మామూలుగా చేయ‌ట్లేద‌ని పార్టీ వ‌ర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.

సీనియ‌ర్ నేత‌గా ఆయ‌న‌కు ఇది అవ‌స‌ర‌మా ? అంటే మ‌రోసారి త‌న‌కు ఛాన్స్ వ‌స్తుందో లేదో తెలియ‌దు... వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తానో లేదో చెప్ప‌లేను.. మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నుకున్నా.. ఆ ఆశ కూడా తీర‌లేదు.. మ‌ళ్లీ ప్ర‌జాప్ర‌తినిధి అవుతాడా... పార్టీ గెలుస్తుందా అన్న సందేహాల మ‌ధ్య ఈ సీనియ‌ర్ నేత ఇలా వెన‌కేసుకుంటున్న‌ట్టు భోగ‌ట్టా..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: