తగ్గెదే లే అంటున్న హైడ్రా? రూటు మార్చి మరీ కూల్చివేతలు?
హైడ్రా ఈ మధ్య కాలంలో ఇంతలా వినిపించిన పేరు మరొకటి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట వినిపిస్తున్న పేరు ఇది. చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టుకున్న నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలోనే చాలా మంది ఎమ్మెల్యేలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షం నుంచి సరే సరే. ఏకంగా హైడ్రా బాధితుల పేరిట ఓ ఉద్యమాన్ని సిద్ధం చేసింది బీఆర్ఎస్.
ఇప్పటి వరకు హైడ్రా చర్యలను సమర్థిస్తూ వస్తున్నా ఈ మధ్య కాలంలో మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాయ కష్టం చేసి కట్టుకున్న ఇళ్లను నిట్ట నిలువునా కూల్చేస్తుంటే కొందరు పేదలు రోడ్డున పడుతున్నారు. అధికారులు అన్ని అనుమతులు ఇచ్చిన ఇళ్లపై కూడా హైడ్రా బుల్డోజర్లు చేయు వేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అందుకే కూల్చివేతల టైంలో హైడ్రామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ హైడ్రా చర్యలకు తోడు ఈ మధ్యం మూసీ నిర్వాసితులు కూడా చేరారు. మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూసీ నదిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించి రెడ్ మార్క్ చేస్తున్నారు. దీన్ని చాలా మంది స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఓ వైపు హైడ్రా , రెండో వైపు మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజలను రోడ్డున పడేస్తోంది ప్రభుత్వం అని ప్రతిపక్షాలు ఉద్యమ బాట పట్టాయి.
బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీన ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. ఇప్పటి వరకు సాఫీగా సాగిన ఈ యజ్ఙంలో ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. దీంతో హైడ్రా కూడా ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. అందుకే బడా బాబుల నిర్మాణాలపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. మూసీ విషయంలోను ఆచితూచి ముందడుగు వేయాలని చూస్తోంది. పేదలు, మధ్య తరగతి వారితో ముందుగా మాట్లాడి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, ప్యాకేజీ, ఇతర సదుపాయాలపై విస్త్రృత ప్రచారం కల్పించిన తర్వాత ముందుకెళ్లాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.