ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డూ ప్రసాదం పై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కల్తీ లడ్డూ వివాదం పై పలువురు మంత్రులు, అధికారులు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలశ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగంచిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్లు నిర్ధారణ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం సిట్‌ను కూడా ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది.ఈ క్రమంలో లడ్డూ వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ లడ్డూ వివాదంపై తాజాగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రస్తుతం సమయం లేదని తేల్చి చెప్పింది. వచ్చే వారం రెగ్యూలర్ పిటిషన్ వేసుకోవాలని కేఏ పాల్‌కు హైకోర్ట్ ధర్మాసనం సూచించినట్లు సమాచారం. ఇదిలావుండగా పవన్ కళ్యాణ్ ఇవాళ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై పాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రాజీనామాకు డిమాండ్ చేశారు.లడ్డూ గురించి ముందే తెలిసినప్పుడు 100 రోజుల సందర్భంలో ఎందుకు చెప్పారని సీఎం చంద్రబాబును కేఏ పాల్ ప్రశ్నించారు. పవన్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని, అసలు సనాతనధర్మం గురించి పవన్ కి ఏం తెలుసని పాల్ అడిగారు.
హిందు ముస్లిం, క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పెడతావని పవన్ ను ఆయన ప్రశ్నించారు. పవన్ 15నిమిషాల ప్రెస్ మీట్ విని అలసి పోయానన్నారు. పవన్ తక్షణం ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలన్నారు. ఈ నేపథ్యంలో లడ్డు వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని తాను కోర్టులో పిల్ వేసినట్లు తెలిపారు. లేకపోతే ఇటలీ ప్రభుత్వం వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్లు 34 లక్షల మంది ప్రజలున్నా తిరుపతిని ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశారుపవన్ సనాతన ధర్మం కోసం చనిపోతే నేను ప్రజలకోసం చనిపోతా అని పాల్ తెలిపారు. పవన్ స్క్రిప్ట్ ఇస్తే దాన్నే చదువుతాడని, బుర్ర వాడడని పాల్ ఎద్దేవా చేసారు. జగన్ నాతో రా, ప్రత్యేక హోదా కోసం, స్టీల్ ప్లంట్ కోసం పోరాటం చేద్దామని పాల్ ప్రతిపాదించారు. ప్యాకేజ్ స్టార్ లు చాలా మాట్లాడతారని, చంద్రబాబు పెద్ద ప్యాకేజ్ స్టార్ అని అన్నారు.