తెలంగాణ: హైడ్రాపై ఫస్ట్ టైం స్పందించిన మాజీ సీఎం కేసీఆర్.!

FARMANULLA SHAIK
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హైడ్రా మీదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్టమవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు. హైడ్రా అంటే ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది.ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఏళ్ల తరబడి నిర్మించిన భవనాలను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో కొత్తగా నిర్మించిన వాటిని మాత్రమే కూల్చివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాలాలు, మూసీ నది సమీపంలో నిర్మించిన నిర్మాణాలు.. ఎఫ్ టీఎల్ పరిధిలోకి పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఇలాంటి వాటి విషయంలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఈ నిర్మాణాలను కూల్చివేస్తారంటూ కొన్ని రాజకీయ పార్టీలు, కొంత మంది భయపడుతున్నారు.ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలపై మాజీ సీఎం కేసీఆర్ తొలిసారిగా స్పందించినట్లు తెలుస్తోంది. చెరువు భూములు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలకు కూల్చివేతలే పరిష్కారం కాదని పేర్కొనట్లు సమాచారం.ఎంఎస్ మక్తా వంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, అలాంటి వాటిని ఎలా తొలగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు కంటే ముందే లక్షల ఎన్‌క్రోచ్ మెంట్లు ఉన్నాయని, కూల్చివేతలకు బదులుగా కొత్త వాటికి అనుమతులు ఆపడంపై దృష్టి సారించాలని కేసీఆర్ హితవు పలికినట్లు సమాచారం.ఇదిలాఉండగా, నగరంలో హైడ్రా పరిమితిని పెంచడంతో పాటు దానికి విసృత అధికారాలు ఇవ్వడంపై రేవంత్ సర్కార్ సమాలోచనలు చేస్తుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రక్రియ సైతం పూర్తయినట్లు సమాచారం. ఓఆర్ఆర్ పరిధిలోని బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే జనాలు ఉంటున్న ఇళ్లను వదిలి నిర్మాణంలో ఉన్నవాటిని తప్పక కూలుస్తామని కమిషనర్ రంగనాధ్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: