శింగనమల శివంగి.. కష్టం వచ్చిందో వెన్నంటే అడుగు..!
•కష్టం వస్తే నేనున్నా అంటున్న శ్రావణి
•యువతకు రోల్ మోడల్..
(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )
కష్టాల కడలిని దాటి ఎట్టకేలకు విజయతీరానికి చేరుకుంది శింగనమల శివంగి బండారు శ్రావణి. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అనంతపురం జిల్లా శింగనమల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపు సొంతం చేసుకుంది. 2013లో తెలంగాణలోని హైదరాబాదులో ఎస్టీ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి మాస్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ అందుకున్న ఈమె ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు అండగా నిలవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో శింగనమల నియోజకవర్గం నుండి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఘోరంగా ఓడిపోయింది.
ఓటమి తర్వాత ఎన్నో అవమానాలు, హేళనలు ఎదుర్కొన్న బండారు శ్రావణి ప్రజలలో మన్ననలు పొందడానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టింది. ఇక అధికార పార్టీ చేస్తున్న దుర్వినియోగాన్ని ఎండగడుతూ ప్రజలకు అన్ని విషయాలలో అండగా నిలిచింది. ఇక అదే ఆమెను అధికారంలోకి తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఈసారి ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఎం వీరాంజనేయులుపై 8,788 ఓట్ల మెజారిటీతో విజయం అందుకుంది. ఇకపోతే బండారు శ్రావణి విజయం సాధించిన తర్వాత ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి నేనున్నాను అంటూ ముందుకు వస్తోంది.
శింగనమల నియోజకవర్గం పరిధిలో ఉండే ప్రతి మండలానికి స్వయంగా వెళుతూ అక్కడి పరిస్థితులను తెలుసుకొని మరి ప్రజలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రైతులకు అండగా నిలవడానికి రెడ్డిపల్లి సమీపంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన బండారు శ్రావణి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందేలా అక్కడి వారితో చర్చలు జరిపింది. ఇకపోతే ఇటీవల ఏర్పడిన వరదల కారణంగా విజయవాడ నియోజకవర్గం అంబాపురం గ్రామంలో పర్యటించిన ఈమె వరద బాధితులకు కావలసిన ఆహారాల ను పంపిణీ చేయడమే కాదు తన నెల జీతాన్ని కూడా వరద బాధితులకు విరాళంగా ప్రకటించింది.
ఇకపోతే గత కొంతకాలంగా అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందించడానికి పెద్ద పెద్ద హాస్పిటల్స్ తో మాట్లాడి తన పవర్ను ఉపయోగించి వారికి ఉచిత వైద్య అందించేలా ప్లాన్ చేస్తోంది. అంతేకాదు లెదర్ ఫ్యాక్టరీని సందర్శించిన ఈమె అక్కడివారికి ఉపాధి కల్పించేలా హామీ ఇచ్చింది. ఇలా ఒక్కటేమిటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తూ అటు ప్రజలకు ఇటు యువతకు కష్టం వచ్చిన ప్రతిసారి అండగా నిలుస్తూ వారిని అభివృద్ధి దిశగా అడుగులు వేయించే ప్రయత్నం చేస్తోంది శ్రావణి.అన్యాయానికి, అక్రమానికి ఎవరైనా పాల్పడ్డారు అని తెలిస్తే శివంగిలా వారిపై చర్యలు తీసుకుంటుంది. ఏది ఏమైనా యువ లీడర్ అనిపించుకున్న బండారు శ్రావణి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది అని చెప్పవచ్చు.