ప్రకృతి వైపరీత్యాలు హీరోలు - జీరోలు.. హీరోలకేనా.. హీరోయిన్స్ కి పట్టదా..?
•10 లక్షలు కూడా ఇవ్వడానికి ముందుకు రాని హీరోయిన్స్
•బయటకి శ్రీరంగనీతులు.. అసలు వీరికి హృదయమే లేదా..?
ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు ఎలా ఉంటాయో.. ఎవరికి ఎంత నష్టం జరుగుతుందో చెప్పడం అసాధ్యం..భూకంపం , వరదలు ఇలా ఏదైనా సరే ఒకసారి విజృంభించింది అంటే ఒక భాగం ప్రజలు మొత్తం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా మనం ఇప్పటికే చూసే ఉన్నాం. ఇకపోతే ఇటీవల జరిగిన వరదలను మనం దృష్టిలో పెట్టుకున్నట్లైతే విజయవాడ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో వరద ఉధృతి ఏ విధంగా ఉందో అక్కడి ప్రజలనే కాదు అక్కడ ప్రజల ఆర్తనాధాలు వింటే కూడా మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే ఈ ప్రాంతాలు నీటిమయం అయ్యాయో తెలంగాణలో ఖమ్మం జిల్లా కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది..
ఇక ప్రజలను ఆదుకోవడానికి చాలామంది రాజకీయ నాయకులు , సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా హీరోలైతే తమను ఇంత స్థాయికి తీసుకొచ్చిన తెలుగు ప్రేక్షకుల రుణాన్ని తీర్చుకోవడానికి సమయం వచ్చిందంటూ కోట్ల రూపాయలను ప్రకటిస్తూ.. మంచి మనసును చాటుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్నోసార్లు వరదలు రావడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఇలా హీరోలు ముందుకు వచ్చి కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు. ఇకపోతే హీరోలు తమ వంతు సహాయంగా ముందుకు వచ్చి ఎంతో కొంత ప్రకటిస్తున్నారు కానీ హీరోయిన్లు మాత్రం ఎప్పుడూ కూడా వరదలు వచ్చిన సమయంలో కనీసం రూ.10 లక్షలు కూడా ప్రజల కోసం విరాళంగా ఇచ్చిన దాఖలాలు లేవు.
ఒక ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో అప్పుడప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. ఈ వరదల కారణంగా ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అప్పుడు కూడా ఏ ఒక్క హీరోయిన్ చెల్లించలేదు. ముఖ్యంగా ఒక సినిమాకి ఒప్పుకున్న తర్వాత కోట్ల రూపాయలను పారితోషకంగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రేంజ్ లో వీరు పారితోషకం అందుకుంటున్నారు అంటే దానికి ప్రజలే కారణం, ప్రజలే ప్రేక్షకులుగా వీరి సినిమాలను ఆదరిస్తేనే కదా వీరికి ఈ రేంజ్ లో స్టార్ట్డం లభించేది. అయితే మూలాలను మరిచిపోయి అసలు ప్రజలకు ఏం జరిగినా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నయనతార, సమంత, అనుష్క, దీపికా పదుకొనే , అలియా భట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఒక్కో సినిమాకు పారితోషకం తీసుకుంటున్నారు. ఒక్క సినిమాకే ఈ రేంజ్ లో తీసుకుంటున్నారంటే ఇక వారు ఎంత వెనుక వేసి ఉంటారో మనం ఆలోచించవచ్చు. కనీసం తీసుకున్న పారితోషకం నుంచి రూ.50 లక్షలు కూడా ప్రకటించలేని దుస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉన్నా సరే తమకేంటి అన్న ఆలోచన రీతిలో హీరోయిన్లు నడుచుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగు హీరోయిన్ అయిన అనన్య నాగళ్ల ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ తన వంతుగా రూ.10 లక్షల ప్రకటించింది. కోట్ల రూపాయలు అందుకుంటున్న హీరోయిన్స్ ఎందుకు ముందుకు రావడం లేదు అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలిచివేస్తోంది. మరి దీనిపై హీరోయిన్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.