గోదావరి.. మన రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రానికి కూడా నువ్వే..!
•రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు గోదావరి ప్రవాహ ప్రాంతాలకు కూడా ముప్పే
•ప్రజలు అప్రమత్తం కావాలంటున్న ప్రభుత్వాలు..
గత నాలుగైదు రోజులుగా వరదల ఉధృతి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది.కనీ వినీ ఎరుగని విధంగా సంభవించిన ఈ విపత్తు రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురిచేసిందని చెప్పవచ్చు. భారీ వర్షాల వల్ల అటు ఏపీ ఇటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా నదులు , చెరువులు ఏకం అయిపోయి, జనావాసాలన్నింటినీ కూడా జలమయం చేసేశాయి. ప్రత్యేకించి రాజధాని అమరావతి మొత్తం నీట మునిగిపోయి, విజయవాడలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల , ప్రకాశం జిల్లాలలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా వేలాదిమంది ప్రజలను ముంపు ప్రాంతాల నుండి సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఇక ఇదే తరహా పరిస్థితులు అటు తెలంగాణలో కూడా ఏర్పడ్డాయి. ప్రత్యేకించి వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట , హన్మకొండ, ఖమ్మం జిల్లాలు అత్యంత దారుణంగా వరద కారణంగా దెబ్బతిన్నాయి. విజయవాడలో బుడమేరు తరహాలోనే ఖమ్మంలో మున్నేరు వాగు పొంగిపొర్లుతోంది. ఇప్పటివరకు ఇలాంటి వరద అసలు అక్కడ కనిపించలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మున్నేరు ఉధృతికి పలు కాలనీలు పూర్తిగా జలమయం అయిపోయాయి.
ముఖ్యంగా ఇదే తరహా పరిస్థితులు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా సంభవించే ప్రమాదం లేకపోలేదు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.. కొన్ని గంటలుగా గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ పోతుండడంతో ఈ ఆందోళనకు ప్రధాన కారణం అవుతుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరింత ప్రమాదకరంగా పెరుగుతోంది. మహారాష్ట్ర పరివాహక ప్రాంతాలు ఉపనదుల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా గోదావరి ప్రవాహ ప్రాంతాలు మరింత అప్రమత్తంగా అవ్వాల్సి ఉంటుంది.
ఇక వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరద జలాలు దీనికి తోడవడంతో మహారాష్ట్రలోని నాందేడ్ సహా గోదావరి పరివాహక ప్రాంతాలలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇక దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై కూడా పడుతోందని చెప్పవచ్చు. తెలంగాణలోని భద్రాచలం , ఏపీలోని ధవలేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతి మరింత పెరుగుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారి 163 మీదుగా గోదావరి నీరు ప్రవహించడంతో దీని తీవ్రతకు అడ్డం పడుతుందని చెప్పవచ్చు.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు గోదావరి ప్రవాహ సమీప ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం కావాలని ప్రభుత్వ హెచ్చరికలు జారీ చేసింది.