ఏపీ: ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్న వాలంటీర్లు.?
కాగా ఎన్నికల ముందు లక్ష మందికి పైగా వలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించారు. ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లను వాడుకోవద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎన్నికల ప్రచారంలో వలంటీర్ల సేవలను వాడుకుని లబ్ధి పొందడానికి వైసీపీ నేతలు వారితో రాజీనామా చేయించారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. అప్పుడు తిరిగి వలంటీర్లుగా తీసుకుంటామని భరోసా ఇచ్చారు.వైసీపీ నేతల మాటలు నమ్మిన వలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వారి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో వలంటీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు మొర పెట్టుకుంటున్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్లు, బెదిరింపులతోనే తమ ఉద్యోగాలకు రాజీనామా చేశామని చెబుతున్నారు.అయితే.. తాజాగా మరోసారి వాలంటీర్లు తమ ఆవేదనలను వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల బకాయిలు ఇవ్వాలని ₹10,000 జీతం హామీని వెంటనే అమలు చేయాలని వాలంటీర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. గత ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన లక్ష మందిని విధుల్లోకి తీసుకోవాలని కోరింది. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల ఉద్యోగ భద్రతపై స్పష్టమైన ప్రకటన చేయాలంది. లేదంటే cm చంద్రబాబు, Dy.CM పవన్‌కు తమ ఆవేదన తెలిసేలా ఈ నెల 31 నుంచి వాలంటీర్ల నివేదన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించింది.