ఓర్నీ పరామర్శలోనూ నవ్వేనా.. జనం ఏం అనుకుంటున్నారంటే..!
అధికారంలో ఉంటే కొన్ని రకాల తప్పులు, తప్పిదాలు చెల్లుబాటు అవుతాయి. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. వీలైనంత వరకు తెలియని విషయాల జోలికి పోకూడదు. ఒకవేళ తెలియకపోతే మౌనంగా ఉండాలి.
కానీ ఈ విషయంలో జగన్ వైఖరి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన హావభావాలు, వైఖరిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతకంటే మించి సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోతున్నారు. వీలైనంత వరకు ఆయన్ను మౌనంగా ఉంచి మిగతా నేతలు రాజకీయం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ మృతులతో పాటు బాధిత కుటుంబాలను మాజీ సీఎం జగన్ పరామర్శించారు.
అయితే అక్కడ ఆయన వ్యవహారశైలి, హావభావాలు, విచిత్రమైన ప్రకటనలు చూసి వైసీపీ నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన నవ్వు చర్చకు దారి తీస్తోంది. ప్రత్యర్థి సోషల్ మీడియాకు వరంలా మారుతోంది. మృతుల కుటుంబ సభ్యులు, బాధితులను పరామర్శించినప్పుడు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావడం లేదు.. అటువంటి చోట నవ్వితే నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు. చిరునవ్వు మంచిదే. కానీ గాంభీర్యం ప్రదర్శించాల్సిన చోట నవ్వితే ఎదుటివారు అపార్థం చేసుకుంటారు.
కానీ జగన్ అదే పనిగా నవ్వడం విమర్శలకు తావిచ్చింది. బుగ్గలను నిమిరి, తలపై చేయి వేసే పలకరించే విధానాన్ని జగన్ ఇంకా విడిచి పెట్టడం లేదు. విపక్ష నేతగా ఉండేటప్పుడే పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఏకంగా ముద్దులే పెట్టారు. తలపై చేయి వేసి నాది భరోసా అంటూ అందరికీ హామీలు ఇచ్చారు. పాదయాత్ర పొడవునా ఇదే పరిస్థితి కనిపించింది.
కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రమాదం జరిగింది. 18 మంది మరణించారు. 60 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. అటువంటి చోటుకి వచ్చి విషాదాన్ని ప్రదర్శించాలి. కానీ జగన్ నవ్వు మొహంతో ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.