మంత్రి నుంచి ముఖ్యమంత్రి దాక.. భాస్కరరావు స్కెచ్ మాములుగా లేదుగా..!!
* కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా నాదెండ్ల భాస్కరరావు గుర్తింపు
* ఎన్టీఆర్ టీడీపీ స్థాపనలో భాగమయిన భాస్కరరావు
* చివరికీ ఎన్టీఆర్ సీటుకే ఎసరు పెట్టారుగా..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టించిన నాదెండ్ల భాస్కరరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అప్పట్లో ఎన్టీఆర్ కు, భాస్కర రావుకు మధ్య జరిగిన రాజకీయ రచ్చ పెను సంచలనమనే చెప్పాలి..నాదెండ్ల భాస్కరరావు 1935, జూన్ 23 న గుంటూరు లో జన్మించారు.. వృత్తిరీత్యా న్యాయవాది అయిన భాస్కరరావు ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి బి.ఏ ఎల్.ఎల్.బీ పట్టా పొందారు. 1978 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజక వర్గము నుండి కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.1978 నుండి 1989 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యునిగా కొనసాగిన ఈయన మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గములో అలాగే టి.అంజయ్య మంత్రివర్గములో మంత్రిగా కూడా పనిచేసారు.అలాగే 1998లో ఖమ్మం నియోజక వర్గం నుండి పన్నెండవ లోక్‌సభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు.1982, మార్చి29న తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ పార్టీ స్థాపించడంలో రామారావు తోడుగా నాదెండ్ల భాస్కరరావు కూడా భాగమయ్యారు. ఎన్టీఆర్ అద్భుతమైన ప్రసంగాలతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నారు. దీనితో పార్టీ ప్రారంభించిన 9 నెలలకే 1983 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నందమూరి రామారావు ముఖ్యమంత్రిగా అలాగే నాదెండ్ల భాస్కరరావు ఆయన మంత్రి వర్గములో కేబినెట్ హోదా కలిగిన ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే కొంతకాలనికి ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావు గుండెకు ట్రిపుల్ బైపాస్ శస్త్రచికిత్స చేయించుకొనేందుకు టెక్సాస్ వెళ్లారు.అయితే ఆ సమయంలో భాస్కరరావు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ల వద్ద సంతకాలు తీసుకున్నారు.1984 ఆగస్టు 14న మళ్ళీ ఎన్టీఆర్ తిరిగి వచ్చారు.. హైదరాబాదు విమానాశ్రయంలో ఈయన్ను ఆహ్వానించడానికి ఆర్థిక మంత్రిగా ఉన్న భాస్కరరావు కూడా వెళ్లారు. .అయితే విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ రోజు సాయంత్రం నాదెండ్ల భాస్కరరావును మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందిగా గవర్నర్ ను కోరారు. ఎన్టీఆర్ సూచన మేరకు గవర్నర్ రాంలాల్ భాస్కరరావును మంత్రి పదవి నుండి తొలగించారు .
ఆగస్టు 15 ఉదయం గవర్నరు పతిపక్ష కాంగ్రెస్ నాయకున్ని కలిసారు.కేంద్ర ప్రభుత్వము నుండి టెలిఫోన్ సందేశము కూడా అందుకున్నారు.అయితే ఎన్టీఆర్ గవర్నరును కలిసి సభలో తన మద్దతును నిరూపించుకోవడానికి శాసనసభను ఆగస్టు 18న సమావేశపరచవల్సిందిగా కోరాడు.అలాగే ఉద్వాసన పలికిన ఆర్థిక మంత్రి, నాదెండ్ల భాస్కరరావు గవర్నరును కలిసి తనకు ముఖ్యమంత్రినయ్యే మద్దతు ఉందని, తెలుగుదేశం అసమ్మతి సభ్యులు, కాంగ్రేస్ పార్టీ సభ్యుల మద్దతు కూడా తనకుందని, మంత్రివర్గము ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని కోరాడు.ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష కార్యదర్శి ఎన్.టీ.రామారావుకు మద్దతునిస్తున్న 163 మంది సభ్యుల జాబితా గవర్నరుకు పంపాడు.ఆగస్టు 16 ఉదయం నాదెండ్ల భాస్కరరావు తన మద్దతుదారులతో గవర్నరు కార్యాలయము చేరుకున్నాడు. కాంగ్రేస్ శాసనసభా పక్ష పార్టీ భాస్కరరావుకు మద్దతునిస్తున్న తీర్మానాన్ని గవర్నరుకు పంపింది.అదే సమయానికి ఎన్టీఆర్ తనకు మద్దతునిస్తున్న 163 సభ్యుల జాబితా పత్రికలకు విడుదల చేశారు..
ఆ తరువాత వారిని గవర్నరు నివాసము ముందు ప్రవేశపెట్టారు. గవర్నరు ఇరు పక్షాల మద్దతును ప్రత్యక్షముగా అంచనా వేయకుండా రామారావు ప్రభుత్వాన్ని గద్దె దించి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.గవర్నర్ ఈయనకు అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు సమయం ఇచ్చారు.. భాస్కరరావు దొడ్డిదారిన సీఎం అవ్వడంతో రామారావు ప్రజల్లోకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు..ఎన్టీఆర్ చేసిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఆయనకు ఎంతో సహాయంగా నిలిచాయి.దీనితో ఈ నెలరోజుల గడువులో ఎంతో డబ్బు ఖర్చుపెట్టినా కూడా భాస్కరరావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయారు.. ఫలితంగా సెప్టెంబరు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా వైదొలిగారు.కేంద్ర ప్రభుత్వం తిరిగి రామారావును ముఖ్యమంత్రిని చేసింది..