ఏపీలో ఆ పార్టీ పనులను కాపీ కొడుతోన్న బీజేపీ.. పురందేశ్వరి ముందు అనేక సవాళ్లు!

frame ఏపీలో ఆ పార్టీ పనులను కాపీ కొడుతోన్న బీజేపీ.. పురందేశ్వరి ముందు అనేక సవాళ్లు!

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారాక అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి సర్కార్ ప్రజాపాలన దిశగా సాగిపోతోంది. అయితే బీజేపీ పరిస్థితి మాత్రం కాపీ కొట్టే రీతిలో కనిపిస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వినతులను కూడా తీసుకుంటూ వస్తున్నాయి. ప్రజా దర్బార్ పేరుతో టీడీపీ, జనవాణి పేరుతో జనసేన ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నాయి. తమ ప్రాంతంలో కానీ, తమ కుటుంబంలో కానీ సమస్యలు ఏవైనా సరే వాటి గురించి ప్రజలు టీడీపీ, జనసేనకు తెలియజేస్తూ వస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆ రెస్పాన్స్ చూసి బీజేపీ కూడా ఇన్నాళ్లకు నిద్రలేచింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా బీజేపీ తమ స్థాయిలో సారథి అనే పేరుతో ప్రజల నుంచి వినతులు తీసుకుంటోంది. ఈ నెల 15వ తేది నుంచి సారథి కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టగా దానిపై పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సారథి కార్యక్రమాన్ని బీజేపీ చాలా గొప్పగా ప్రచారం చేసుకోవడం పట్ల ప్రజల నుంచి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. కేంద్ర పార్టీ అయిన బీజేపీకి ప్రజల సమస్యలు ఇంత వరకూ తెలియవా? అనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రజల సమస్యలు తెలుసుకున్నాక మళ్లీ వాటిని రాష్ట్ర సర్కార్ తెలియజేసి సీఎం చంద్రబాబు ద్వారా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం బీజేపీ చేయనుంది. దీనికే కమలనాథులు ఇంత బిల్డప్ ఇవ్వడం ఏంటనే విమర్శ ఎదురవుతోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీలు అయిన టీడీపీ, జనసేనలు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నాయి కదా. మరి బీజేపీ కూాడా దానిని కాపీ కొడుతూ అలాంటి కార్యక్రమం చేయాలా? అనే ప్రశ్న రాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన పురందేశ్వరికి ఎదురవుతోంది.
బీజేపీ ఇప్పుడు ప్రజల కోసం కాకుండా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం తరపున కేంద్రంలో తన వాయిస్ వినిపిస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, జిల్లాలకు నిధులు తేవడం, నీటి వివాదాలపై పరిష్కారం తీసుకొచ్చే మార్గాలను అన్వేషించాలి. కేంద్ర సర్కార్‌కు అన్ని వివరంగా చెప్పి రాష్ట్రానికి మేలు జరిగేలా చూడాలి. అలాంటిది చేయకుండా ఇలా కాపీ కొట్టే కార్యక్రమాలను బీజేపీ చేయడం ఏంటనే ప్రశ్న పురందేశ్వరికి ఎదురవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: