ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వైఎస్ షర్మిల తొలిసారి వైసీపీని పక్కన పెట్టి కూటమి సర్కార్‌ను ప్రశ్నించారు. ఏపీ పీసీసీ చీఫ్ అయిన తర్వాత షర్మిల మొదటిసారి బాధ్యతాయుతంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తన గళాన్ని వినిపించారు. నాగార్జున సాగర్ జలాశయం కుడికాలువ నుంచి సాగునీరు రైతులకు అందింది. అయితే సాగునీరు వచ్చినా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 4 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగిందని షర్మిల మండిపడ్డారు. రైతులు సాగు చేసుకునేందుకు డిమాండ్ ఉన్న విత్తనాలు మార్కెట్లో దొరకడం లేదు. దీనివల్ల రైతులు సాగు చేయలేకపోతున్నారు. ఈ విషయంపైనే కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం రైతుల ఆశలను ఆవిరి చేస్తోందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బీడు భూముల్లో సాగు చేసి బంగారం పండిద్దామనుకున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. విత్తన విక్రయ కేంద్రాల వద్ద పోలీసులను కాపలా పెట్టి పదో పరకో ఇచ్చి పంపించేస్తున్నారని, తమకు నచ్చిన విత్తనాలనే ప్రభుత్వం విక్రయించడం ఏంటని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వర్షంలో కూడా లైన్లలో రైతులను నిలబెట్టి విత్తనాలు ఇవ్వడం దారుణమని, ఇది రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపని ఆమె ఆరోపించారు. రైతు సర్కార్ అని చెప్పుకునే కూటమి సర్కార్ ఇలా చేయడం తప్పని అన్నారు.
గత పది రోజుల నుంచి విత్తన విక్రయ కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. 48 గంటల్లోపు రైతులకు అవసరమైన జేసీఎల్ 384 రకం విత్తనాలను 15 వేల క్వింటాళ్లు రైతులకు అందుబాటులో ఉంచాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రాయితీ ద్వారానే ఆ విత్తనాలను రైతులకు పంపిణీ చేయాలన్నారు. రైతు విత్తనాలకు సంబంధించి జరుగుతున్న బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, వెంటనే రైతు సమస్యలు పరిష్కరించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.