ఆ పగ తీర్చుకోవడానికే ధురంధర్ చేశా.. స్టార్ నటుడు సెన్సేషనల్ కామెంట్స్..!

Thota Jaya Madhuri
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ హీరోగా నటించగా, కీలక పాత్రలో అర్జున్ రాంపాల్ తనదైన శైలిలో మెప్పించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అర్జున్ రాంపాల్ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2008లో జరిగిన 26/11 ముంబై ఉగ్రదాడులు సమయంలో తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితులను ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ రోజు తన పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి ముంబైలోని ప్రసిద్ధ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ కు వెళ్లాలని ప్లాన్ చేసినట్టు తెలిపారు. అయితే అకస్మాత్తుగా పేలుళ్ల శబ్దాలు వినిపించడం, పరిస్థితి ఒక్కసారిగా భయానకంగా మారడం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.

ఉగ్రదాడులు వేగంగా విస్తరించడంతో తాను ఉన్న హోటల్ పూర్తిగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిందని, ఆ రాత్రంతా బయటకు రావడానికి కూడా అవకాశం లేకుండా అక్కడే గడపాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఆ సమయంలో ముంబై నగరం ఎదుర్కొన్న దారుణ పరిస్థితులను తన కళ్లతో చూసినప్పుడు కలిగిన భయం, ఆవేదన ఇప్పటికీ మరిచిపోలేనివని అన్నారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు చూసిన విధ్వంస దృశ్యాలు తన మనసును ఎంతగానో కలిచివేశాయని, ఆ దృశ్యాలను తలుచుకుంటే వాంతులు వచ్చేంతగా అసహనం కలిగిందని ఆయన భావోద్వేగంగా చెప్పారు. ఆ సంఘటనలు తన జీవితంలో చెరిగిపోని ముద్ర వేశాయని, ఇప్పటికీ అవి గుర్తుకొస్తే హృదయం భారంగా మారుతుందని అర్జున్ రాంపాల్ తెలిపారు. ఇలాంటి సమయంలో దర్శకుడు ఆదిత్య ధర్ తనకు ‘ధురంధర్’ కథ వినిపించినప్పుడు, అందులోని 26/11 నేపథ్యం తన పాత జ్ఞాపకాలను మళ్లీ ప్రేరేపించిందని చెప్పారు.

ఈ సినిమాలో తన పాత్ర ద్వారా ఆ ఉగ్రదాడులపై తనలో ఉన్న కోపం, బాధ, దేశభక్తిని వ్యక్తపరచుకునే అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు. “ఇది కేవలం ఒక పాత్ర కాదు, నా మనసులో ఉన్న ఆవేదనకు ఒక ప్రతిస్పందన. ఆ ఉగ్రవాదులపై ఉన్న ఆగ్రహాన్ని ఈ సినిమా ద్వారా బయటపెట్టాను” అని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఈ పాత్రను ఎంతో ఆసక్తితో, నిబద్ధతతో చేశానని చెప్పారు. చివరగా, తన దేశంపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ “భారత్ మాతా కీ జై” అంటూ తన భావోద్వేగాలను వ్యక్తపరిచారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: