పవన్ టార్గెట్లో వైసీపీ లీడర్... గింగరాలు కొట్టిస్తారా ?
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బండ్లు ఓడలు అవుతూ ఉంటాయి.. ఓడలు బండ్లు అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇక ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన వైసీపీ నేతలను ఇప్పుడు జనసేన నాయకులు ... కేడర్ గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ... పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు దమ్ముంటే సిటీ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని సవాళ్లు రువ్వారు. చివరకు పవన్ కళ్యాణ్ సైతం ఈసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేను నిన్ను గెలవనీయను... అసెంబ్లీ గేటు తాకనీయును అని శపథం చేశారు.
వాస్తవానికి సిటీ నుంచి జనసేన పోటీ చేయాలని అనుకున్నా.. చివరిలో జనసేన కాకినాడ రూరల్ స్థానం నుంచి పోటీ చేసి ఏకంగా 72,000 భారీ తేడాతో విజయం సాధించింది. పక్కనే ఉన్న పిఠాపురం నుంచి పవన్ 70 వేల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికలలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చేసిన అక్రమాలు ... అవినీతిని ఇప్పుడు జనసేన ప్రజాప్రతినిధులు బయటపెట్టి ద్వారంపూడి టార్గెట్ చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఐదేళ్లు ద్వారంపూడికి చుక్కలు కనపడటం ఖాయం అంటున్నారు.