బాబుకు బిగ్ సవాళ్లు: పోలవరం పోటు..మరో కాళేశ్వరం అవుతుందా.?

Pandrala Sravanthi
- ఏపీ ని కలవర పెడుతున్న పోలవరం..
- చంద్రబాబు అయినా పూర్తి చేస్తారా.?
- ఈ తరం ప్రజలు పోలవరాన్ని చూసే భాగ్యముందా.?


పోలవరం ప్రాజెక్ట్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరు గాంచింది. దీని పేరులోనే వరం ఉంది తప్ప ఏపీ ప్రజలకు ఇప్పటివరకు ఎలాంటి ఉపయోగం లోకి రాలేదు. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కానీ నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పటివరకు ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ప్రాజెక్టు సాగు తాగు నీరు మరియు విద్యుత్ ఉత్పత్తి అవసరాలతో పాటు ఎన్నో పారిశ్రామిక అవసరాలు తీర్చేలా డిజైన్ చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవంగా భావించే ఈ పోలవరం పనులు ఒక్క అడుగు ముందుకు ఆరడుగులు వెనక్కు అనే విధంగా నడుస్తూ ఉంది.ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనే ప్రశ్నకు ఇప్పటికి సమాధానం దొరకడం లేదు.ఇప్పటికే ఎంతో మంది ముఖ్యమంత్రులు గడువులు ఇచ్చుకుంటూ పనులు చేయిస్తామని కొన్ని పనులు చేయించారు తప్ప ఎవరూ కూడా పూర్తి చేయలేకపోయారు. అలాంటి ఈ ప్రాజెక్టును చంద్రబాబు అయినా పూర్తి చేస్తారా.. మాటలకే పరిమితం చేస్తారా అనే వివరాలు చూద్దాం..

 బడ్జెట్ వ్యయం :
 జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత భూసేకరణ చట్టాన్ని సవరించడంతో ఈ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిపోయింది.  2013- 14 అంచనా ప్రకారం 20,398 కోట్లుగా ప్రకటించారు. 2017- 18 కి వచ్చేసరికి 55,548 కోట్లకు చేరింది. అలాంటి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి  భూసేకరణ పునరావాసం పునర్నిర్మాణ పనులకు దాదాపు 34 వేల కోట్లు అవుతాయని అంచనా వేశారు.  అయితే జగన్ ప్రభుత్వం 2024 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి దాన్ని పూర్తి చేయడంలో విఫలమైంది. ప్రస్తుతం  చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు కేంద్రంలో కీలకమైన వ్యక్తిగా మారారు. దీంతో ఆయన రాష్ట్రంలో పాలన ఒకెత్తయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మరో ఎత్తుగా  భావించారు. తాజా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించారు. సోమవారం పోలవరం పేరుతో ప్రతి సోమవారం ప్రాజెక్టుపై రివ్యూ మీటింగ్ ఉంటుందని చెప్పారు. ఒకసారి పోలవరం దగ్గరికి ప్రత్యక్షంగా ఆయన వెళ్లి చూస్తానని కూడా హామీ ఇచ్చారు.  అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర సహకారం పూర్తిగా ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినట్టు తెలుస్తోంది.


కేంద్ర ప్రభుత్వం కూడా సమ్మతంగా ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్టుని ఈ మధ్యనే విదేశీ నిపుణులు కూడా చూసి వెళ్లారు.ఈ విధంగా అన్నీ కలిసి వస్తే మాత్రం ప్రస్తుత  పరిస్థితుల్లో పోలవరం పూర్తిగా నిర్మించాలంటే దాదాపుగా లక్ష కోట్ల బడ్జెట్ పడుతుందని అంచనా వేస్తున్నారు. మరి చూడాలి పూర్తిగా కేంద్రం భరిస్తుందా లేదంటే  కొంతవరకు సమకూర్చి మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెబుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.  ఇదే తరుణంలో తెలంగాణ కల్పవల్లిగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా  కేంద్ర సహకారం లేకుండానే దాదాపుగా కేసీఆర్ పూర్తి చేశారు. దీని కోసం లక్ష కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కానీ ఇప్పటికీ ఈ ప్రాజెక్టు వల్ల  పూర్తి స్థాయిలో ఉపయోగం లేదని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో  కాళేశ్వరం ప్రాజెక్టుకు కరెంట్ బిల్లులే వేలాది కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతమైన భారం పడడంతో ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత  ఆగిపోయింది. మరి పోలవరం కూడా కాళేశ్వరంలా అవుతుందా లేదంటే చంద్రబాబు కంకణం కట్టుకొని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీస్తారా అనేది రాబోవు రోజుల్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: