టీ విత్ డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ సరికొత్త నిర్ణయం!

Suma Kallamadi
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను ఎమ్మెల్యేగా వచ్చే జీతం తీసుకుంటానని గతంలో చెప్పినా, తాను చూస్తున్న పంచాయతీ రాజ్ శాఖలో నిధులలేమి కారణంగా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. జీతం లేకుండానే పని చేస్తానని పేర్కొన్నారు. మరో వైపు తాను చూస్తున్న వివిధ శాఖలపైనా తనదైన ముద్ర వేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం, తిరుపతి జూలాజికల్ పార్కులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, ఎక్కువ మంది సందర్శకులను ఆకట్టుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ గౌరవాధ్యక్షుని హోదాలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరి నివాసంలో 14వ పాలకమండలి సమావేశం నిర్వహించారు. జూ పార్కుల నిర్వహణ, ఆదాయంపై బుధవారం అధికారులతో చర్చించారు.
అటవీ & వన్యప్రాణి శాఖను నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, ఈ పార్కులకు ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడానికి పర్యావరణ అనుకూలమైన కార్యక్రమాలను అనుసరించాలని అధికారులను కోరారు. “జూ పార్కులను అభివృద్ధి చేయడానికి నిధులను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో సేకరించాలి. అలాగే జంతు మార్పిడి కార్యక్రమం కింద అరుదైన అన్యదేశ, ఆకర్షణీయమైన జంతువులను జూ పార్కులకు తీసుకురావాలి’’ అని అధికారులకు సూచించారు. "జూ పార్కులను సందర్శించే సందర్శకులకు ఉత్తమ వన్యప్రాణుల అనుభవాన్ని అందించడానికి ఏర్పాట్లు చేయండి" అని ఆయన చెప్పారు.

జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీలను భాగస్వామ్యం చేయాలని అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు. ‘‘జూ పార్కుల అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధులను వినియోగించాలి. జంతువులను దత్తత తీసుకుని, జూల అభివృద్ధికి విరాళాలు ఇచ్చేలా కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి' అని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు విశాఖపట్నం, తిరుపతిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు. "అవసరమైతే, కార్పొరేట్లు-పారిశ్రామికవేత్తలను కలుపుకొని 'టీ విత్ డిప్యూటి ముఖ్యమంత్రి' పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించాలి." అని సూచించారు. పవన్‌ను చూసేందుకు పెద్ద పెద్ద నాయకులు, పారిశ్రామిక వేత్తలు, సామాన్య ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఆయనతో టీ తాగే అవకాశం వస్తే వదలరు కదా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక మంచి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని అంతా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: