దేవినేని ఉమా శ‌కం ముగిసిందా.. చంద్ర‌బాబు ముగించేస్తారా ?

RAMAKRISHNA S.S.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో మాత్రమే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా బాగా ఫేమస్ అయ్యారు.. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. దివంగత దేవినేని వెంకటరమణ రాజకీయ వారసుడుగా ఆయన సోదరుడుగా రాజకీయాలకు వచ్చిన దేవినేని ఉమా.. నందిగామ - మైలవరం రెండు నియోజకవర్గాల నుంచి ఓటమిలేకుండా నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మూడు సార్లు శాసనసభకు ఎంపికైన ఆయన.. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ముందు నందిగామ, ఆ తర్వాత మైలవరం నుంచి గెలిచిన ఉమా.. 2019 ఎన్నికలలో మాత్రం తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి అయిన వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు.

అది కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఓడిపోయారు. ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాలను తన కొనసైగ‌లతో శాసించిన ఉమాను ఒకే ఒక్క ఓటమి అధః పాతాళానికి తొక్కేసింది. చివరకు ఈ ఎన్నికలలో ఉమాకు చంద్రబాబు సీటు కూడా ఇవ్వలేదు సరి కదా.. ఉమా పై గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్ ను టీడీపీలోకి తీసుకుని మైలవరం టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ ఘనవిజయం సాధించారు. సీటు త్యాగం చేసిన ఉమాకు ఇప్పుడు ఏ పదవి ? ఇస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. ఎమ్మెల్యే రాజ్యసభ పదవులు ఇచ్చే సీన్ కనపడటం లేదు.

పైగా ఉమా కమ్మ సామాజిక వర్గం కావడంతో.. కమ్మ సామాజిక వర్గం కోటాలో రాజ్యసభ - ఎమ్మెల్సీ పదవులకు గట్టి పోటీ ఉంది. ఇక డిసిసిబి చైర్మన్, జడ్పీ చైర్మన్ పదవులు ఉమా స్థాయికి చాలా చిన్న పదవులు అని చెప్పాలి. ఈ పదవులు కాకుండా మరేదైనా నామినేటెడ్ పదవి ఇచ్చినా అది ఉమా స్థాయికి తక్కువే అవుతుంది. ఏది ఏమైనా తెలుగుదేశంలో ఒకప్పుడు కీలక నేతగా ఉండి.. ఇప్పుడు కనీసం ఎమ్మెల్యేగా కూడా కాకుండా ఎలాంటి ప్రాధాన్యం లేకుండా ఉమా ఉండటం ఆయన అభిమానులకు మాత్రమే కాదు.. తెలుగుదేశం పార్టీలోనే రాష్ట్ర స్థాయిలో చాలామందికి ఎంత మాత్రం నచ్చటం లేదు. మరి చంద్రబాబు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: