బీజేపీలో, బీఆర్ఎస్ విలీనం.. ఢిల్లీలో కేటీఆర్, హరీష్ చర్చలు..?

RAMAKRISHNA S.S.
ఎస్ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటు ఢిల్లీ రాజకీయ వర్గాలలో ఇదే చర్చ హాట్‌ టాపిక్ గా మారింది. బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా. ? అంటే బిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఢిల్లీ వేదికగా బీజేపీ నేతలతో భేటీ అయ్యేందుకు ఢిల్లీలో మకాం వేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి వారం రోజుల క్రిందట హరీష్ రావు ఢిల్లీ వెళ్లి జైలులో ఉన్న కవితతో భేటి అయ్యారు. వారం రోజుల వ్యవధిలోనే కేటీఆర్, హరీష్ మరోసారి ఢిల్లీ వెళ్లి కవితతో భేటి అయ్యారు.

వీరిద్దరూ ఢిల్లీలోనే ఉండి బీజేపీ అగ్రనేతలను కలిసి చర్చించేందుకు అపాయింట్మెంట్ కోసం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీకి అవసరం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. పైగా ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు రాలేదు. అలాంటి బీఆర్ఎస్ అవసరం బీజేపీకి ఎంత మాత్రం లేదు. ఒక్క లోక్‌సభ ఎంపీ కూడా లేని బీఆర్ఎస్ తో బీజేపీకి ఏం అవసరం ఉంటుంది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే బిఆర్ఎస్ అంతర్గతంగా బీజేపీతో కలిసి పని చేస్తామని చెప్పినా బీజేపీ ఒప్పుకునే ప్రసక్తి లేదు.

బీజేపీ తెలంగాణలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలలో ఉంది. ఈ క్రమంలో కేటీఆర్, హరీష్ తమ రాజకీయ భవిష్యత్తు కోసం బిఆర్ఎస్ ను బీజేపీ లో విలీనం చేసే అంశాన్ని కూడా చర్చకు పెడతారా..? అన్న పుకార్లు కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తమ ఫ్యామిలీపై ఉన్న కేసులు.. అలాగే కవిత జైలులో ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తమను మోడీ తప్ప ఎవరూ కాపాడలేరన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చేశారు. అందుకే ఇప్పుడు ఢిల్లీలో మకాం వేసి మరి బీజేపీ అగ్ర నేతలతో చర్చించేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే వీరిని బీజేపీ నేతలు ఎంతవరకు దగ్గరకు రానిస్తారో అన్నది కూడా డౌటే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: