కాలం చాలా మహిమ గలది. అది ఎవరిని ఎప్పుడు అందలమెక్కిస్తుందో, ఎవరిని ఎప్పుడు కింద పడేస్తుందో ఎవరు ఊహించలేరు. అందుకే పదవి ఉన్నప్పుడు ఒకలాగా, పదవి లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే కాలమే వారికి సరియైన సమాధానం చెబుతుంది. దానికి ప్రత్యక్షంగా తాజాగా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలను మనం తీసుకోవచ్చు. సరిగ్గా తెలంగాణకు కూడా ఇదే వర్తిస్తుంది. ప్రజల భావోద్వేగానికి గురైతే ఎలాంటి ప్రతిఫలం వస్తుందో ప్రస్తుతం తేటతెల్లం అయిపోయింది. ఇక మారవలసింది పాలకులే. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు రాజకీయం చేస్తున్నారు.
దశాబ్ద కాలం కిందట కెసిఆర్ తెలంగాణ ప్రజల భావోద్వేగాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని అధికారంలోకి వచ్చాడు. తర్వాత కాలంలో కెసిఆర్ ఒక నియంతృత్వ పోకడకు తెర లేపారు. అక్కడి నుండే వారి పతనం మొదలైంది. ప్రజాస్వామ్య భారతంలో సహజ సిద్ధంగా ఉండాల్సిన వాక్ స్వతంత్రం మీద ఎన్నో ఆంక్షలు విధించారు. దాంతో సగటు ఓటరు మనోభావాలు దెబ్బతిన్నాయి. తత్ఫలితంగా ఊహించలేని విధంగా అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇది నిజానికి కెసిఆర్ స్వయంకృతపరాధం అనే చెప్పుకోవాలి. ఇక మ్యాటర్ లోకి వెళ్తే కేసీఆర్ కు ఆరు అనే సంఖ్యతో గట్టి అనుబంధమే ఉంది. ఈ క్రమంలోనే తాను చేసే ప్రతి ముఖ్యమైన పనిలో ఆరు అనే సంఖ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే అదే ఆరు ఆయన రాజకీయంగా దెబ్బ తినడానికి కారణమైందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్న మాట.
అవును, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కెసిఆర్ వేలుతోనే ఆయన కన్ను పొడిచేలా ప్లాన్ చేసినట్టు కనపడుతుంది. ఆరును ఒక సెంటిమెంట్ గా భావిస్తున్న కేసీఆర్ కు అదే 6 తో కంగు తినేలా చేస్తున్నాడు రేవంత్. విషయం ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుండి ఇప్పటివరకు ఆరుగురు గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడం జరిగింది. ఇది అక్కడితో ఆగలేదు.... తాజాగా నిన్న రాత్రి ఆరుగురు గులాబీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పంచన చేరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో విశ్లేషకులు కేసీఆర్ కు ఆరు అనే గండం పట్టుకుందని గుసగుసలాడుకుంటున్నారు. అవును, ఇంతవరకు గులాబీ బాస్ కి అదృష్టంగా మారిన ఆరు అనే సంఖ్య ఇప్పుడు దురదృష్టంగా మారడం చాలా దురదృష్టకరం!