ఏపీ: రాపాక ఈసారి ఏ పాకలో దూరుతాడు... మళ్ళీ ప్లేట్ మార్చేశాడుగా?

Suma Kallamadi
ఏపీలో తాజా ఎన్నికల ఫలితాలు గత ప్రభుత్వం వైస్సార్సీపీకి భారీ షాకిచ్చాయి. వైసీపీయే కాదండోయ్... కూటమిలో ఏ పార్టీ కూడా ఊహించని స్ధాయిలో జనం ఈసారి కూటమికి విజయం కట్టబెట్టారు. దీంతో కూటమి 164 సీట్లతో అధికారం చేపట్టగా.. వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. దీంతో షాక్ కు గురైన వైఎస్ జగన్, వైసీపీ నేతలు కొంతమంది ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చని, ఈవీఎంలను అభివృద్ధి చెందిన దేశాలు కూడా వాటిని వాడటం మానేసి బ్యాలెట్ పైనే ఆధార పడుతున్నాయని ఇలా రకరకాల వాదనలు తెరపైకి తెస్తున్న సంగతి అందరికీ తెలిసినదే కదా. ఈ క్రమంలో తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాపాక స్పందిస్తూ వైసీపీకి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.
విషయం ఏమిటంటే... ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలు కరెక్ట్ కాదని, అనవసరంగా కూటమిపైన నింద వేయడం సరికాదని అన్నారు. గతంలో అన్ని పార్టీలు విడిగా పోటీచేసినప్పుడు వచ్చిన ఓట్లు తమకు తెలుసని, ఇప్పుడు 3 పార్టీలు కలిసిపోవడం వల్లనే ఇలాంటి ఫలితాలు వచ్చాయని అన్నారు. గతంలో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్లనే టీడీపీ ఓటమి పాలైందని, కానీ ఈసారి ఏకంగా 3 పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల ఓటు బ్యాంకు బదిలీ అయిందని, అందువల్లే వైసీపీకి ఇక ఓటమి తప్పలేదని జోశ్యం చెప్పారు. ఈ క్రమంలో జనం వైసీపీకి ఓట్లు వేయలేదని బల్లగుద్ది మరీ చెప్పారు రాపాక. దీంతో వైసీపీ నేతలు చేస్తున్న వాదన అంతా డొల్ల అని రాపాక తేల్చిచెప్పేశారు.
ఇక ఈ వ్యాఖ్యలపై వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇపుడు భగ్గుమంటున్నారు. అధికారం ఎటువైపు ఉంటే అటువైపు మాట్లాడే రాపాక ఈ సారి ఏ పాకలో దూరుతాడో మాకు అర్ధం అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి వెనక్కి వెళితే... 2019లో జనసేన తరపున గెలిచిన ఒకే ఒక్క రాజోలు అభ్యర్థి రాపాక, వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో జగన్ పంచన చేరారు. తీరా ఈసారి ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మరలా ప్లేట్ ఫిరాయించి ఇలా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో విశ్లేషకులు ఇలా నేతలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా విషయం ఏదైనప్పటికీ తాజా ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన రాపాక వరప్రసాదరావు ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రకంగా మాట్లాడడం మాత్రం హాస్యాస్పదం!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: